శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దాతలకు మాత్రమే గదులు మంజూరు చేస్తామని టీటీడీ తెలిపింది.
- సిఫారసులకు గదుల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్ రద్దు
- 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించరు
సాక్షి, తిరుమల
అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు మంజూరు చేస్తామని ఆదివారం టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సిఫారసులకు గదులు కేటాయించరు. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలకు రెండు గదులు రెండు రోజులపాటు కేటాయిస్తారు. ఒకే కాటేజీలో ఒక గదికి విరాళం ఇచ్చిన దాతలకు ఒక గది రెండురోజులపాటు కేటాయిస్తారు. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారిని సమర్పించాలి. అయితే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7వ తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించరని ఆ ప్రకటనలో తెలియజేసింది. దాతలు కూడా సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గదుల అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్‌ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు.