
ఉద్యాన రైతులకు సాంకేతిక పరిజ్ఞానం
వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఉద్యాన సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ కార్యదర్శి పార్థసారథి అధికారులకు సూచించారు. ఆదివారం జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, పాలీహౌస్ రైతులు, అభ్యుదయ రైతులు, సూక్ష్మ సేద్య కంపెనీల ప్రతినిధులకు ఉద్యాన పంటల సాగులో అత్యాధునిక పద్ధతులు, మెళకువలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంట సాగు విధానంలో అధిక దిగుబడి సాధించేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన, సాంకేతిక సమాచారం అందించాలని పార్థసారథి అన్నారు.
నర్సరీ చట్టంలో సవరణ చేసిన వివరాలను జిల్లా అధికారులు పాటించాలని, ప్రతి నర్సరీలో నాణ్యమైన నారు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండటంతో పాటు కేటాయించిన జిల్లాల్లో స్థానికంగా నివాసం ఉండాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల కమిషనర్ వెంకట్రాంరెడ్డి ఆదేశించారు. పట్టు పరిశ్రమ పథకాల అమలుకు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లతో మాట్లాడినట్లు చెప్పారు. సమావేశంలో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, సెంటర్ అఫ్ ఎక్సలెన్సీ ఇన్‌చార్జి లహరి, రాజ్ కుమార్, రాష్ట్ర పాలీ హౌస్ రైతుల సంఘం అధ్యక్షులు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.