సాక్షి ప్రతినిధి, ఏలూరు : పుష్కరాలకు మునుపెన్నడూ లేనిరీతిలో అత్యాధునిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పుష్కరాలకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోందన్నారు. పుష్కరాల తొలి రోజు నుంచి చివరి రోజు వరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు అవసరమైతే హెలికాప్టర్లను విని యోగించాలని భావిస్తున్నామని తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు రెండు డ్రోన్‌లు, 16 నైట్‌విజన్ బైనాక్యులర్లు, 167 సీసీ కెమెరాలను వినియోగిస్తామని చెప్పారు. బందోబస్తు కోసం జిల్లాలోని సిబ్బందితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 4,500 మందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నరసాపురం సబ్ డివిజన్లలో పుష్కరాల బందోబస్తును అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. ఏ కేటగిరీ ఘాట్లలో డీఎస్పీలు, బీ కేటగిరీ ఘాట్లలో సీఐలు, సీ కేటగిరీ ఘాట్లలో ఎస్సైలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను కొవ్వూరులో ఉంటూ నరసాపురం సహా అన్ని పుష్కర ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.
ఆరు జోన్లుగా విభజన
జిల్లాను 6 జోన్లుగా విభజించి పుష్కరాల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్, ఘాట్ల వద్ద బందోబస్తు, శాంతిభ్రదతల పర్యవేక్షణ, ఆలయాలు, ఇతరత్రా సౌకర్యాల కింద ఆరు విభాగాలుగా విడగొట్టి, ఒక్కో జోన్‌కు డీఎస్పీ స్థాయి అధికారిని బాధ్యులుగా పెడతామని చెప్పారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో పుష్కర ఘాట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించేది లేదన్నారు. ఏలూరు నుంచి కొవ్వూరు వచ్చే వాహనాలను పుష్కరనగర్ వద్ద, నిడదవోలు, రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రోడ్ కం రైల్ బ్రిడ్జి వద్ద నిలిపివేస్తామని చెప్పారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ఘాట్లకు వెళ్లాలన్నారు. వీవీఐపీ వాహనాలను ఘాట్ల వరకు అనుమతించాలా లేదా అనే విషయమై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు.
చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
పుష్కరాలకు లక్షలాది మంది వస్తున్న నేపథ్యంలో దొంగలు తమ చేతివాటం చూపించే అవకాశం ఉందని ఎస్పీ అన్నారు. అన్ని పుష్కర ఘాట్ల వద్ద ఇప్పటివరకు చోరీల చరిత్ర ఉన్న వాళ్ల ఫొటోలు ప్రదర్శిస్తామని చెప్పారు. భక్తులు విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలతో రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు ఎదురైతే ఏ సమయంలోనైనా 94407 96688 నంబర్‌కు ఫోన్ చేసి తనతో మాట్లాడవచ్చన్నారు.
హెలికాప్టర్లతో నిఘా
Published Thu, Jul 9 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement