ప్రజాహితమా.. కమీషన్ల కక్కుర్తా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత’లో ప్రాణం లేకుండా చేసేవిధంగా డిజైను మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కమీషన్ల కక్కుర్తే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో బుధవారం తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాన్ని, మీడియాను, నిపుణులను, మేధావులను పట్టించుకోవడంలేదన్నారు.
కమీషన్లు, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచిది కాదని ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైను మార్పు విషయంలో ఇప్పటికే నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. డిజైను మార్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయంటూ కొన్ని స్వచ్ఛందసంస్థలు, రిటైర్డు ఇంజనీర్లు వాదిస్తున్నారని ఉత్తమ్ చెప్పారు.
ప్రాణహిత డిజైను మార్పుపై టీపీసీసీ వైఖరిని ప్రకటించడానికి ముందు సాగునీటిరంగ నిపుణులతో లోతుగా చర్చిస్తామని వెల్లడించారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టుల డిజైన్లను ఎవరికివారే ఇష్టం వచ్చినట్టుగా మారిస్తే అంతిమంగా ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని ఉత్తమ్ హెచ్చరించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పనిని పూర్తిచేయాలనే అంశం కంటే సెంటిమెంటును రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టులపై గాంధీభవన్‌లో గురువారం నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. వీటితో పాటు గ్రామీణ ఉపాధిహామీ పథకానికి పనిదినాలను తగ్గించడంపై ఈ నెల 25న చర్చిస్తామన్నారు. వీటికి ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, ఆర్.సి.కుంతియాతో పాటు టీపీసీసీ నేతలు హాజరవుతారన్నారు.