
అత్యాచార బాధితులకు అండ : ఎంపీ కవిత
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లిలో అత్యాచారానికి గురై ఇటీవల మరణించిన మైనార్టీ యువతి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. శనివారం నిజామాబాద్లో స్థానిక మైనార్టీ సంస్థల ప్రతినిధులు ఎంపీ కవితను కలసి సదరు యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వెంటనే స్పందించిన కవిత... జిల్లా కలెక్టర్ యోగితారాణాతో మాట్లాడారు. అనంతరం కవిత మాట్లాడుతూ... బాధితురాలి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితోపాటు రెండు ఎకరాల పొలం తమ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. జిల్లాలోని మోర్తాడు మండలం ఏర్గట్ల గ్రామంలో మైనార్టీ వర్గానికి చెందిన మరో మహిళ రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైంది.
ఆమెకు ప్రభుత్వం తరఫున కేవలం రూ. 50 వేలు ఇచ్చారని మైనార్టీ నాయకులు గుర్తు చేశారు. దాంతో బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని సదరు మైనార్టీ నాయకులకు కవిత ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు హఫీజ్ మహమ్మద్ లయిక్ ఖాన్, హఫీజ్ ఇంతియాజ్, హఫీజ్ అబ్దుల్ హకీం, మౌలానా అబ్దుల్ హలీం, హఫీజ్ అష్రఫ్ తదితరులు ఎంపీ కవితను కలిసిన వారిలో ఉన్నారు.