భారత్-బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనకు భారత్ విచ్చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సోమవారం యూకే టెక్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన మే.. భారత్-బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఆర్ధిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
బ్రిటన్ లో భారత్ పెట్టుబడులు తమ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి యూరపేతర పర్యటనకు భారత్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూకే తాజాగా పెద్ద మొత్తంలో అభివృద్ధిని సాధించిందని గుర్తు చేశారు. అకడమిక్స్ తో పాటు ఆవిష్కరణలో యూకే ముందుందని చెప్పారు.
తక్కువ ఖర్చులో వైద్యం, విద్యుత్తు, సాంకేతికతల్లో భారత్-యూకేల మధ్య వ్యాపారానికి అవకాశం ఉందని చెప్పారు. సౌరశక్తిపై పరిశోధనా అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాడానికి ఇరుదేశాలు పరస్పర అంగీకారాన్ని తెలిపాయని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు యూకే-భారత్ లు భవిష్యత్తులో కలిసి పనిచేయాలని కోరారు. భారత్-యూకే భాగస్వామ్యంలో మేక్ ఇన్ ఇండియా కీలకంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.