పీఆర్సీ జీవోలకోసం ఎదురుచూపు
ఫిట్‌మెంట్ అమలుకే మూడు నెలలు
♦ మిగతా జీవోలు వచ్చేదెప్పుడు? అమలయ్యేదెప్పుడు?
♦ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
♦ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం
♦ పెన్షనర్ల అదనపు పెన్షన్‌కోసం గొంతెత్తాలని నిశ్చయం..
♦ కార్యాచరణపై త్వరలో జేఏసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు ఉద్యోగులను ఉస్సూరుమనిపిస్తోంది.
43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేశాక.. అమలుకు ఆరునెలల సమయం పట్టింది. సీఎం ప్రకటన తర్వాత జీవో రావడానికే మూడు నెలలు, జీవో వచ్చాక అమలు చేయడానికి మరో మూడు నెలల సమయం తీసుకున్నారు. ఫిట్‌మెంట్ ప్రకటన చేసినరోజే.. పీఆర్సీ సిఫారసులను సూత్రప్రాయంగా ఆమోదిస్తున్నామని సీఎం ఘనంగా ప్రకటించారు. అయితే ఆరునెలల తర్వాత కూడా పీఆర్సీ సిఫారసుల అమలుకు ప్రాథమిక కసరత్తును పూర్తి చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
దీంతో వీటికి సంబంధించిన జీవోలు వచ్చేదెప్పుడు? అమలయ్యేదెప్పుడు? అని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫారసుల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించడానికి జేఏసీ కార్యవర్గం త్వరలో సమావేశం కానుంది. కాగా 75 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది. దీన్ని 70 ఏళ్ల వయసునుంచే అమలు చేయాలని పీఆర్సీ స్పష్టంగా చెప్పింది. అయితే పెన్షనర్లకు ఫిట్‌మెంట్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోలో పీఆర్సీ సూచించినట్లుగా అదనపు పెన్షన్ అంశాన్ని పేర్కొనలేదు.దీంతో 70 ఏళ్లు నిండినవారికి అదనపు పెన్షన్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉద్యోగసంఘాలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయి. దీనిపైనా జేఏసీ సమావేశంలో చర్చించనున్నారు.
పీఆర్సీ చేసిన సిఫారసులు..
♦ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్
♦ పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ రూ.200 నుంచి రూ.350కు పెంపు
♦ మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవు
♦ అర్ధవేతన సెలవుల్ని పదవీ విరమణ సమయంలో నగదుగా మార్చుకునే అవకాశాన్ని స్థానికసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బందికీ పునరుద్ధరణ
♦ పే స్కేళ్లు పెరిగిన నేపథ్యంలో.. వివిధరకాల అలవెన్సుల పెంపు. స్పెషల్ పే పెంపు
♦ రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంపు.
♦ అంత్యక్రియల ఖర్చు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు
♦ నగరాలు/పట్టణాల పరిధిని 8 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల వినతిని పీఆర్సీ పట్టించుకోలేదు. ప్రభుత్వమైనా ఈ మేరకు జీవో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
♦ 25 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హత కల్పిస్తూ ఎనిమిదేళ్ల సర్వీసు వెయిటేజీ.
♦ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినిలకూ ప్రభుత్వ ఉద్యోగినిల మాదిరే వేతనంతో కూడిన ప్రసూతి సెలవు .
♦ ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.18,750కు పెంపు.
♦ పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజు రూ.1000 నుంచి రూ.2,500కు పెంపు .
డీఏ మంజూరుకు ఎంతకాలం?
ఉద్యోగులకు సంబంధించి జనవరి, జూలైలో.. ఏటా రెండుసార్లు కొత్త డీఏ ప్రకటిస్తారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ప్రకటించే డీఏను బట్టి రాష్ట్రంలో డీఏను నిర్ణయిస్తారు. పదో పీఆర్సీ సిఫారసు ప్రకారం కేంద్రంలో 1 శాతం డీఏ పెరిగితే రాష్ట్రంలో 0.524 శాతం పెంచాలని సూత్రీకరించడం తెలిసిందే.
ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్రం 6 శాతం డీఏ ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంచాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతోసహా దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు కొత్త డీఏను మంజూరు చేశాయి. జూలై నుంచి మరోసారి డీఏ పెంపు అమలు కావాల్సి ఉన్నా.. జనవరి నుంచి రావాల్సిన డీఏ గురించి కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో రొటీన్‌గా పెంచాల్సిన డీఏకోసం ఎంతకాలం ఎదురుచూడాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.