హైదరాబాద్ : ఈ సారి సంక్రాంతి పండుగ ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు బాగా కలిసి వచ్చింది. బుధవారం ఒక్క రోజు ఆఫీసులకు వెళితే మళ్లీ సోమవారం నాడు ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో బోగి, సంక్రాంతికి రెండు రోజులు మాత్రమే ప్రభుత్వ సెలవులుండేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి సంక్రాంతికి మూడు రోజుల సెలవులను ప్రకటించింది. బోగి, సంక్రాంతి, కనుమ పండుగకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది.
గురువారం నుంచి శనివారం వరకు పండుగ సెలవులైతే ఆదివారం వారాంతపు సెలవు వచ్చింది. దీంతో పండుగకు ఊర్లు వెళ్లేందుకు ఉద్యోగులకు, అధికారులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి గ్రామాలకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్లేవారు.
గ్రామాలకు తరలి వెళ్లే వారి కోసం జంటనగరాల్లో తిరిగే సిటీ బస్సులను ఆంధ్రా ప్రాంతాలకు నడిపేవారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ సిటీ బస్సులను ఎల్‌బినగర్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి ఆర్టీసీ నడుపుతోంది. రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో సగం మంది జనం గత శుక్రవారమే సంక్రాంతి పండుగకు గ్రామాలకు తరలివెళ్లారు. మిగతా వారు బుధవారం ఆఫీసు ముగిసాక గ్రామాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
సంక్రాంతికి సొంత ఊరిలో సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చితూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నాం విజయవాడ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు వెళ్తారు. 16వ తేదీ మధ్యాహ్నాం వరకు నారావారిపల్లెలోనే ఉంటారు. సంక్రాంతి పండుగను అక్కడే జరుపుకుంటారు.
16వ తేదీ మధ్యాహ్నాం బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. 17వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి కర్నాటకలోని ఉడిపికి వెళ్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని 18వ తేదీ ఉదయం బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.