
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై సెలవులు, అధికారిక పర్యటనల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌గా పిలిచే ఈ వ్యవస్థను కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా సోమవారం నాడిక్కడ ఆవిష్కరించారు. ఈ వ్యవస్థలో భాగంగా 5 మాడ్యుల్స్‌లో 25 అప్లికేషన్లను ప్రారంభించారు.
‘ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో సర్వీస్ బుక్, జీపీఎఫ్, జీతం వివరాలను చూడటంతో పాటు సెలవులు, పలురకాల క్లెయిమ్‌లు, రీయింబర్స్‌మెంట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్లు, అడ్వాన్సులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఎల్‌టీసీ అడ్వాన్సులు వంటి అన్ని సేవలను ఒకేచోట పొందవచ్చు’ అని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఉద్యోగుల పూర్తి సమాచారం అందుబాటులో ఉండటం వల్ల సంబంధిత విభాగాలు రిక్రూట్‌మెంట్, ట్రాన్స్‌ఫర్, పోస్టింగుల విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చని వెల్లడించింది.