వైఎస్సార్ సీపీ నాయకుల ఆగ్రహం
అనంతపురం: పల్లె.. నోరు అదుపులో పెట్టుకో.. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తే మంత్రి పదవి అలాగే ఉంటుందనే భ్రమలో ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె. వెంకట్‌చౌదరి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యు.పి.నాగిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వెన్నపూస రామచంద్రారెడ్డి మాట్లాడారు. మంత్రి పల్లె రాఘునాథరెడ్డి మతిభ్రమించి వై.ఎస్.జగన్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా విమర్శలు చేసి మంత్రి పదవి కాపాడుకోవాలని చూస్తున్నారని, ఇప్పటికే మంత్రి పల్లె స్థానంలో పయ్యావుల కేశవ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు.
అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చి.. వారిలో ఒక భరోసా కల్పిస్తున్న వై.ఎస్.జగన్‌పై విమర్శలు తగదని హితవు పలికారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు పుష్కరాల పేరుతో రూ.800 కోట్లు సొంత ఖాతాలో జమ చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి అక్రమాలు మంత్రికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహిళలు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. యువత ఉపాధి లేక వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.