కమలాపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్టు ద్వారా సర్వరాయ ప్రాజెక్టుకు నీరు ఇస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని అమలు చేయలేదన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసపూరిత మాటలతో కడప వాసులను భ్రమల్లో పెట్టడమే తప్ప సీఎం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీరు అందిస్తానంటున్న సీఎం కమీషన్ల కోసమే దాన్ని చేపట్టారని విమర్శించారు. గండికోట, హంద్రీనీవా ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించినట్లయితే... కరవు జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాలకు గండికోట ద్వారా సాగు, తాగు నీరు అందుతుందని చెప్పారు.