► అక్కడికి వెళ్లాక అంగడి బొమ్మలవుతున్న మహిళలు
► షేక్‌ల సమక్షంలో వేలం పాటలు.. లైంగిక దాడులు
► వారికి ఎదురుతిరిగితే బెదిరింపులు
► వ్యభిచారంలోకి దింపి నరకం చూపుతున్న వైనం
► పురుషులతో వెట్టి చాకిరీ
► 12 మంది నిందితుల్లో ఏడుగురు అరబ్ దేశాల్లో తిష్ట
► ఐదుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్‌లో జాబ్ అంటారు.. వేలల్లో జీతమని నమ్మబలుకుతారు.. మాయమాటలు చెప్పి లక్షల్లో గుంజుతారు.. తీరా వారి మాటల్ని నమ్మి వెళ్తే నరకకూపంలో దిగినట్టే! మహిళలు, యువతులు అరబ్ షేక్‌ల ముందు అంగడి బొమ్మలై ఏళ్లకేళ్లుగా వ్యభిచార కూపంలో మగ్గిపోతారు. పురుషులు బానిస సంకెళ్లలో బందీ అయిపోయి దేశంకాని దేశంలో నానా అగచాట్లు పడతారు. గత పదేళ్లుగా అమాయకులపై ఇలా వల విసిరి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ) పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్‌లోని ఐదుగురిని పట్టుకున్నారు. మరో ఏడుగురు దుబాయ్‌లో ఉండటంతో వారికోసం విదేశీ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ‘డర్టీ డజన్’గ్యాంగ్ గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు 100 మందిని అరబ్ దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 30 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది.
ముఠా నాయకుడు.. దుబాయ్ శ్రీను
మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా సూత్రధారి పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇతడు అమలాపురం నుంచి వెళ్లి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. ఈ దందా కోసం అక్కడా, ఇక్కడా మొత్తం 11 మంది దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రాంతానికే చెందిన మరియమ్మ, అల్ప శ్రీను, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్‌లతో పాటు కేరళకు చెందిన కరీంను శ్రీనుబాబు అరబ్ దేశాలకు పిలిచించుకున్నాడు. వీరిని దుబాయ్, మస్క ట్, కువైట్, ఖతార్‌ల్లో ఉంచి.. ఆయా చోట్ల మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలతో సంబంధాలు ఏర్పాటు చేశాడు.
ఈ ఏడుగురికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యు.త్రిమూర్తులు, ఎం.తాతాజీ, పి.దాసు, జి.రామారావు (మరియమ్మ భర్త), ఎస్.మురళి సహకరిస్తున్నారు. వీరంతా తమ చుట్టుపక్కల ప్రాంతా ల్లో చిన్న చిన్న పనులు చేస్తున్న వారిలో అరబ్ దేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్న వారిని గుర్తిస్తారు. వారి వివరాలను దుబాయ్ శ్రీనుకు చేరవేస్తారు. అరబ్ దేశాల్లో ఇంటి సహాయకురాలు, కుక్, క్లీనర్స్, కేర్ టేకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించుకోవచ్చని బా« దితులకు ఎర వేస్తారు. అక్కడకు పంపడానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అవుతాయని చెప్పి అందినకాడికి వసూలు చేస్తారు. ఆపై అరబ్ దేశాల్లో ఉన్న మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీల సాయంతో బో గస్ ఉద్యోగ ఆఫర్ లెటర్స్ పంపించి నమ్మిస్తారు.
మహిళల వేలం పాట
ముఠా సభ్యులు.. తమ మాటల్ని నమ్మి డబ్బు చెల్లించిన వారిలో కొందరికి విజిట్ వీసా, మరికొందరికి జాబ్ వీసాలు ఇప్పిస్తున్నారు. దుబాయ్‌కి వెళ్లాక పురుషులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇక మహిళల్ని స్థానికంగా ఉన్న మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఈ ఏజెన్సీలు అరబ్ షేక్‌లకు అనుబంధంగా పనిచేసే కన్సల్టెన్సీల సహకారంతో వేలంపాట నిర్వహిస్తుంటాయి. అరబ్ షేక్‌ల సమక్షంలో జరిగే ఈ వేలంపాటల్లో ఆకర్షణీయంగా ఉన్న వారికి గరిష్టంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు చెల్లిస్తున్నారు.
ఇలా ఆ షేక్‌ల కబంధ హస్తాల్లో చిక్కిన తర్వాత ఆ మహిళల నుంచి పుస్తెలతాడు, మెట్టెలు తీయించేస్తున్నారు. తమ ఇళ్లకు తీసుకువెళ్లి బుర్ఖాలు ధరించాలని ఒత్తిడి చేస్తూ బానిసలుగా చూస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పాస్‌పోర్టులు సైతం షేక్‌ల అధీనంలోనే ఉండడంతో వారంతా ఆ నరకాల్లో మగ్గుతున్నారు. విజిట్ వీసాతో వచ్చి పని చేస్తున్నందున బయటకెళ్తే పోలీసులు అరెస్టు చేస్తారని బెదిరించి తమ ఇళ్లలోనే బందీ చేస్తున్నారు. ఎవరైనా మరీ గొడవ చేస్తే వారిని తిరిగి ‘దుబాయ్ శ్రీను అండ్ కో’కు అప్పగించేస్తున్నారు. ఆ ముఠా.. ఇక్కడున్న బాధితుల సంబంధీకుల నుంచి మళ్లీ డబ్బు వసూలు చేసి, టికెట్లు కొని పంపిస్తున్నారు.
శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. చిత్రంలో నిందితులు
ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రస్తుతం ఘట్‌కేసర్‌లోని అన్నోజీగూడలో నివసిస్తున్నారు. వీరిని సంప్రదించిన త్రిమూర్తులు దుబాయ్ పంపుతానంటూ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది వచ్చిన దుబాయ్ శ్రీను ఈ జంట నుంచి అదనంగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి.. రూ.70 వేలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరి 12న భార్యను, పది రోజుల తర్వాత భర్తను దుబాయ్ పంపాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో పెట్టడంతో పాటు అక్కడున్న పరిస్థితుల్ని గమనించిన వీరు తిరిగి వెళ్లిపోతామంటూ గొడవ చేశారు.
దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వీరి బంధువు నుంచి మరో రూ.70 వేలు వసూలు చేసి, ఆ తర్వాత టికెట్లు కొని పంపారు. అక్కడ్నుంచి తిరిగొచ్చిన ఈ జంట గతేడాది జూన్‌లో ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన మల్కాజ్‌గిరి జోన్ ఎస్‌వోటీ పోలీసులు త్రిమూర్తులు, తాతాజీ, దాసు, రామారావు, మురళీలను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, వివిధ బోగస్ పత్రాలు, విజిట్ వీసా కాపీలు స్వాధీనం చేసుకుంది. దుబాయ్ శ్రీను సహా పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment