ఎస్‌ఏ పోస్టులు అంతంతమాత్రమే.. | 1,754 School Assistants in New DSC | Sakshi
Sakshi News home page

ఎస్‌ఏ పోస్టులు అంతంతమాత్రమే..

Published Wed, Jul 26 2017 2:10 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM

1,754 School Assistants in New DSC

- కొత్త డీఎస్సీలో 1,754 స్కూల్‌ అసిస్టెంట్లు
తెలుగు మీడియంలో 4,779 ఎస్‌జీటీ పోస్టులు
మొత్తంగా 8,792 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
 
సాక్షి, హైదరాబాద్‌: త్వరలో భర్తీ చేయాలని భావిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు చాలా తక్కువగా ఉన్నట్లు విద్యా శాఖ లెక్కల్లో తేలింది. లక్షల మంది బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఎస్‌ఏ పోస్టులు కొన్ని జిల్లాల్లో ఒక్కటీ లేవని తెలిసింది. త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉర్దూ మీడియం మినహా 1,754 ఎస్‌ఏ పోస్టులనే ఇతర మీడియంలలో భర్తీ చేసేలా ప్రభుత్వం నుంచి విద్యా శాఖ ఆమోదం పొందింది. అయితే గతంలో పాఠశాలల మూసివేత కారణంగా పక్కన పెట్టిన అనేక పోస్టులను డీఈవో పూల్‌లో పెట్టేశారు.

వాటి భర్తీకి ప్రస్తుతం చర్యలు చేపట్టకపోవడం కారణంగా త్వరలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. విద్యా శాఖ 8,792 పోస్టుల భర్తీకే ప్రతిపాదనలు పంపడంతో వాటినే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టుల విషయంలో మాత్రం విద్యా శాఖ ముందు చూపుతో ఆలోచించింది. అందుకే 4,779 ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

ప్రాథమిక పాఠశాలల్లోనే ఎస్‌జీటీ పోస్టులు ఉన్నందున కాస్త ఎక్కువ సంఖ్యలో వాటి భర్తీకి ఓకే చెప్పింది. అయినా డీఈవోల అధీనంలో మరిన్ని పోస్టులు ఉన్నట్లు సమాచారం. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను ఇన్నాళ్లు బయట పెట్టని విద్యా శాఖ ఆ వివరాలను పేర్కొంటూ మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం టెట్‌ పరీక్ష నిర్వహించామని, త్వరలోనే టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉర్దూ మీడియంలో 900 పోస్టులను, తెలుగు సహా ఇతర మీడియంలలో 7,892 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement