చదువు సాగేనా..!
♦ వీవీ పోస్టులకు అర్హుల కొరత
♦ ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులతో తెలుగు మీడియం పోస్టులు భర్తీ
సాక్షి, సిటీబ్యూరో : జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కనీసం విద్యావలంటీర్లు (వీవీ) కూడా కరువయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మొత్తం 386 వీవీ పోస్టుల నియామకానికి విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఆన్‌లైన్‌లో సుమారు 1800 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వెరిఫికేషన్ల అనంతరం వెయ్యి మంది మిగిలారు. 275 ఎస్‌జీటీ, 111 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేయగా.. కొన్ని సబ్జెక్ట్‌లకు అర్హులైన అభ్యర్థులు దొరకలేదన్న విషయం వెల్లడైంది. ఇదిలా ఉంటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎవరు, ఎప్పుడు ఇవ్వాలన్న అంశాలపై జిల్లా విద్యాశాఖకు స్పష్టత కొరవడింది. నియామక పత్రాల అందజేతకు సోమవారంతో గడువు ముగిసినా ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు.
మాధ్యమంతోనే గందరగోళం..
వివిధ మాధ్యమాల్లోని (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ తదితర) 275 ఎస్‌జీటీ పోస్టులకు 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో వీవీ పోస్టులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మీడియం బోధనకు ఆప్షన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆంగ్ల మాధ్యమంలోని పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. అయితే తెలుగు మీడియానికి వచ్చేసరికి పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఆయా పోస్టులను భర్తీ చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. తెలుగు మీడియంలోని 182 పోస్టులకు నిర్దిష్టమైన అర్హత గలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడింది.
ఫలితంగా తాత్కాలిక ఎంపిక జాబితా విడుదల చేసిన ఆదివారం నాటికి 127 పోస్టులను మాత్రమే భర్తీ చేయగలిగారు. అదికూడా డీఎడ్ అభ్యర్థులు లేకపోవడంతో బీఈడీ అభ్యర్థులతో సర్దుబాటు చేశారు. మిగిలిన 55 పోస్టుల భర్తీ ప్రక్రియ సోమవారం పూర్తి చేశారు. తెలుగు మీడియం అభ్యర్థులు లేకపోవడంతో.. వారి స్థానాల్లో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను నియమించారు. వీళ్లలో కొంతమంది స్థానిక మండ లానికి చెందిన వారు కాకపోవడంతో కూడా ఇబ్బందులు తలెత్తాయి.
ఎంపికైన వీవీలకు స్కూళ్ల కేటాయింపునకు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన స్కూళ్లు కేటాయించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆ బాధ్యతను డిప్యూటీ ఐఓఎస్‌లకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. అయితే స్కూళ్ల కేటాయింపులో అధికారులకు చిక్కులు తప్పవన్న భావన వ్యక్తమవుతోంది. ఇందులో పనిచేయాల్సిన పాఠశాలలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.