ఎంఎన్‌జే ఆసుపత్రికి 100 వైద్య పోస్టులు
పడకల సంఖ్య 500కు పెంచుతూ సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి అదనంగా 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే పడకల సంఖ్యను 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సంబంధిత ఫైలును సీఎం ఆమోదానికి పంపించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్ష మంది ఫాలోఅప్ వైద్యానికి వస్తారు. దీంతో ఆసుపత్రిలో పడకల సంఖ్య, వైద్య సిబ్బంది ఏమాత్రం సరిపోవడంలేదు. ఫలితంగా రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్‌జే డెరైక్టర్ జయలత పంపిన ప్రతిపాదనల మేరకు పడకల సంఖ్యను రెండింతలు పెంచేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది.
పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్...
ప్రస్తుతం ఆసుపత్రిలో 266 వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. పడకల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటంతో అదనంగా 288 పోస్టులు అవసరమని డెరైక్టర్ జయలత ప్రభుత్వానికి విన్నవించారు. అయితే వాటిల్లో 100 పోస్టులనే మంజూరు చేసినట్లు చెబుతున్నారు. అందులో 50 డాక్టర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. మిగిలిన 50 పోస్టుల్లో నర్సులు, రేడియో థెరపిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులున్నాయి. సీఎం ఆమోదం తెలపగానే వీటికి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని జయలత ‘సాక్షి’కి తెలిపారు. ఈ పోస్టులను వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం భర్తీ చేయనుంది. పరిపాలనా పరమైన పోస్టులను ప్రజారోగ్య విభాగం భర్తీ చేయనుంది. కాగా, కేన్సర్ ఆసుపత్రికి రాష్ట్ర బడ్జెట్లో రూ.28 కోట్లు కేటాయించారు. పడకల సంఖ్య పెరిగితే ఆ బడ్జెట్‌ను రూ.50 కోట్లు పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రికి ఏడాదికి రూ.12 కోట్లు వస్తుంది.