సాక్షి, హైదరాబాద్ : వచ్చే నెలలో పదకొండో వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్థిక శాఖ పీఆర్‌సీకి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ముఖ్యమంత్రి త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పీఆర్‌సీపై చర్చించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పదో పీఆర్‌సీనే అమల్లో ఉంది. వీకే అగర్వాల్ చైర్మన్‌గా ఉన్న పదో పీఆర్‌సీ చేసిన సిఫార్సులనే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేసే కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) కానుంది. జనవరిలో కమిషన్‌ను ఏర్పాటు చేసి జూలై నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కసరత్తు ప్రారంభించింది.
చైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ
ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో అనుభవమున్న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్‌లకు పీఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ కొనసాగుతోంది. చైర్మన్ నియామకం పూర్తిగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైరైన సీనియర్ ఐఏఎస్ ప్రదీప్‌చంద్రతో పాటు స్పెషల్ సీఎస్‌లుగా రిటైరైన ఎంజీ గోపాల్, మహంతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్‌సీ కాల పరిమితి 2018 జూలై 1తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో కనీసం ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ ఆరు నెలల పాటు అధ్యయనం చేయటం తప్పనిసరి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలపై ఉద్యోగుల అభిప్రాయాలను, ప్రతిపాదనలను స్వీకరించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ క్రోడీకరించి కమిషన్ తమ సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గత అనుభవాలతో చెబుతున్నారు. ఆ తర్వాత పీఆర్‌సీ నివేదికను పరిశీలించి, ఏయే ప్రతిపాదనలను ఆమోదించాలి, వేటిని పక్కనబెట్టాలి, ఏయే ప్రతిపాదనలను సవరించాలి అనే అంశాలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ఎంత సుదీర్ఘంగా ఈ ప్రక్రియ కొనసాగినప్పటికీ 2018 జూలై నుంచి ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పలుమార్లు పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి.
పూర్తికాని బకాయిల చెల్లింపు..
ఉమ్మడి రాష్ట్రంలోని పదో పీఆర్‌సీ ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లిస్తోంది. 2014 జూన్‌లో రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ 2013 జూలై 1 నుంచే పీఆర్‌సీ సిఫారసులను వర్తింపజేసింది. 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాల చెల్లింపులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉన్న కాలాన్ని నోషనల్‌గా పరిగణించి.. ఆవిర్భావం నాటి నుంచి నగదు రూపంలో పీఆర్సీ బకాయిలను చెల్లించేందుకు అంగీకరించింది. ఇప్పటికీ బకాయిల చెల్లింపు పూర్తి కాలేదు. ఇటీవలే నెలసరి వాయిదాల్లో ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఈ నెలసరి కిస్తులు పూర్తవుతాయి. అందుకే పాత పీఆర్‌సీ బకాయిల చెల్లింపు పూర్తి కాలేదని, ఇప్పటికిప్పుడు కొత్త పీఆర్‌సీ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా మరింత భారం పెరుగుతుందని ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో కొత్త పీఆర్‌సీని ఇప్పుడే వేయాలా.. కొంత కాలం ఆలస్యం చేయాలా..? అనేది పూర్తిగా సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment