తొలిరోజే.. 18,458 దరఖాస్తులు
ఒంటరి మహిళల ఆర్థికభృతి పథకానికి భారీ స్పందన
- పట్టణ ప్రాంతాల్లోని మీసేవల్లో సాంకేతిక సమస్యలు
- ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన సెర్ప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఒంటరి మహిళలకు ఆర్థికభృతి’ పథకానికి భారీ స్పందన కనిపిస్తోంది. లబ్ధిదారుల ఎంపికకు సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా.. తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా 18,458 మంది మహిళలు ఆర్థికభృతి కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. మొత్తం దరఖాస్తుల్లో పట్టణ ప్రాంతాల నుంచి 2,283 రాగా, గ్రామీ ణ ప్రాంతాల నుంచి 16,175 దరఖాస్తులు అందినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాల నుంచి, వార్డు కార్యాలయాల నుంచి దరఖాస్తు లను స్వీకరిస్తున్నారు.
సోమవారం మీసేవా కేంద్రాల ద్వారా 1,088 దరఖాస్తులు అంద గా.. వార్డు కార్యాలయాల నుంచి 1,195 దర ఖాస్తులు అందినట్లు సెర్ప్ అధికారులు పేర్కొ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అత్యధికంగా 1,500 నుంచి 2,500 దాకా దరఖాస్తులు అందాయి. జనగాం, కుమ్రంభీం, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల నుంచి అందిన దరఖాస్తులు 100కు లోపే ఉండడం గమనార్హం.
సాంకేతిక సమస్యలతో సతమతం..
పట్టణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తొలిరోజు దరఖాస్తుల స్వీకరణకు ఆటంకంగా మారాయి. దోమల గూడ మీసేవా కేంద్రానికి వచ్చిన మహిళల వద్ద ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ.. కార్డు నంబర్‌ను కంప్యూటర్లో నమోదు చేశాక వివరాలు డిస్‌ప్లే కాకపోవడంతో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారు నిరాశగా వెనుదిరి గారు. మరికొన్ని మీసేవా కేంద్రాల్లో సిబ్బందికి ఒంటరి మహిళల దరఖాస్తులను స్వీకరించా లనే విషయం తెలియకపోవడంతో వచ్చిన వారిని వెనక్కి పంపేశారు. ఇంకొన్ని కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తడం, సర్వర్ డౌన్ కావడం.. తదితర ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించా లని ఐటీ శాఖకు సెర్ప్ అధికారులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేం దుకు, పథకానికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సెర్ప్ కార్యాలయంలో కాల్ సెంటర్ (04023241474)ను ఏర్పాటు చేశారు. పనిదినాల్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకంపై అవగాహన కల్పించడంతో పాటు, ఇప్పటికే అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించేందుకు 16 ప్రత్యేక బృందాలను సెర్ప్ సీఈవో పౌసమిబసు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాలని ప్రత్యేక బృందాలకు నాయకత్వం వహిస్తున్న డైరెక్టర్లను సీఈవో ఆదేశించారు.