లక్ష మందికిపైగా ఆర్థిక భృతి!
లక్ష మందికిపైగా ఆర్థిక భృతి!
Published Mon, May 29 2017 2:48 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
- ఒంటరి మహిళల ఆర్థిక భృతికి రూ.49.37 కోట్లు విడుదల
- జూన్ 2న అందజేయనున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2(రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం)న 1,09,292 మంది ఒంటరి మహిళలకు ఆర్థిక భృతిని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.49.37 కోట్లను విడుదల చేసింది. ఏ ఆదరువు లేని ఒంటరి మహిళలకు గత ఏప్రి ల్ 1 నుంచి ఆర్థిక భృతిని వర్తింపజే స్తామని సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సెర్ప్ అధికారులు, వాటిని పరిశీలించిన అనంతరం లబ్దిదారుల లెక్క తేల్చారు. నిబంధ నల మేరకు ఎంపిక చేసిన లబ్దిదారులకు గత రెండు నెలల ఆర్థిక భృతి మొత్తం (రూ.2 వేలు)ను ఆవిర్భావ దినోత్సవం రోజున వారి బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాలకు జమ చేయ నున్నారు. ఆర్థికభృతి మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అదేరోజున అన్ని నియోజక వర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలతో లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఒక్కొక్క నియోజక వర్గానికి రూ.50వేల చొప్పున సెర్ప్ కేటాయించింది.
బీడీ కార్మికులకు ఆలస్యంగానే..
అర్హులైన బీడీ కార్మికులందరికీ ఆర్థికభృతిని అందిస్తామని ప్రకటించిన మీదట కొత్తగా 62,930 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో 23,638 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 9,298 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హులైన బీడీ కార్మికులకు మే నెల నుంచి ఆర్ధిక భృతి వర్తించనుండగా, జూన్ 2న అందజేస్తారని లబ్దిదారులు ఆశించారు. అయితే, ఒంటరి మహిళలకు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసినందున బీడీ కార్మికుల భృతి మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.
Advertisement