వేదనాభరితం వృద్ధాప్యం | Vedic suffering is aging | Sakshi
Sakshi News home page

వేదనాభరితం వృద్ధాప్యం

Published Sun, Nov 5 2017 3:39 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Vedic suffering is aging - Sakshi

సాక్షి, విజయవాడ: చాలా మంది వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తారు. ఆ వయస్సులో ఎలా గడపాలా అని మధ్య వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. వృద్ధాప్యంలో పిల్లలు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని ఆశిస్తారు. తమ ఆలనా పాలనా చూడకపోవడంతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. నేటి ఆధునిక సమాజంలో పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వృద్ధాశ్రమాలకు డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 283 వృద్ధాశ్రమాలు ఉన్నట్లు హెల్పేజ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. వీటిల్లో సుమారు 8,490 మంది వరకు ఉన్నారు. ఇందులో 60 శాతం మంది మహిళలు కాగా, 40 శాతం మంది పురుషులు.  

విభజనానంతరం రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక వృద్ధాశ్రమం నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. తాజాగా.. అనంతపురం, గుంటూరు, విశాఖపట్నాల్లో కనీసం 100 మందికి తగ్గకుండా నూతన వృద్ధాశ్రమాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ అదీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేవలం ఒకేఒక్క వృద్ధాశ్రమం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉంది. అది వికలాంగులు, వృద్ధుల కోసం ఏర్పాటుచేశారు. ఇందులో 36మంది వృద్ధులు, 9 మంది వికలాంగులు ఉన్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదైన రాష్ట్రంలోని 101 వృద్ధాశ్రమాల్లో 6,207 మంది వృద్ధులు ఉంటున్నారు. వీటిలో 90 ఆశ్రమాలకు రూ.6.83 కోట్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు కింద చెల్లిస్తోంది. మరోవైపు తమ వద్ద ఉన్న మౌలిక సదుపాయల మేరకే నిర్వాహకులు వారిని ఆశ్రమాల్లో చేర్చుకుంటుండడంతో వృద్ధాశ్రమాలకు ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది. నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ చట్టం–2017 ప్రకారం ప్రతి జిల్లాలోనూ కనీసం 150 మందికి తక్కువ లేకుండా ఒక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. కానీ, అలా ఎక్కడాలేదు. వృద్ధులకు చెందిన ఆస్తిని కుటుంబసభ్యులు రాయించుకుని తరువాత వారి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఈ చట్ట ప్రకారం ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించి తిరిగి ఆస్తి పొందవచ్చు. 

డబ్బు కొద్దీ సౌకర్యాలు.... 
రాష్ట్రంలో ఉచితంగా నిర్వహించే వృద్ధాశ్రమాలు కొన్నైతే, నిర్ణీత రుసుము తీసుకుని నిర్వహించేవి మరికొన్ని. ఇంకొన్ని చోట్ల రెండు విధాలుగానూ నడుపుతున్నారు. వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి నెలకు రూ.3వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నారు. అనేక వృద్ధాశ్రమాల్లో కేవలం కామన్‌ రూమ్‌లు, బెడ్‌లతో పాటు టీవీ, పేపర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అవసరమైనప్పుడు వైద్య సదుపాయాలు కల్పిస్తారు. కానీ, కొన్ని ఆశ్రమాల్లో వైఫై సౌకర్యం, వెబ్‌ కెమెరాలు, సరదాగా ఆడుకునే సౌకర్యం, వ్యాయామం, యోగా సెంటర్, ఫోన్, లైబ్రరీ, 24 గంటలు వైద్య సేవలు, వ్యక్తిగత రూమ్, వ్యక్తిగత సేవకులు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. అన్ని సౌకర్యాలతో కూడిన వృద్ధాశ్రమాల్లో ఒకొక్కరికి రూ.30వేలు వరకు వసూలు చేస్తున్నారు. 

వృద్ధాశ్రమాల్లో ఎందుకు ఉండాల్సి వస్తోందంటే... 
- భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగా ఉండలేక.. కొడుకులు, కూతుళ్లతో సర్దుకోలేక..  
పిల్లలందరూ విదేశాలల్లో ఉంటే అటువంటి వారు వృద్ధాశ్రమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంట్లో అన్ని చేసుకోలేమని భావించి సకల సౌకర్యాలున్న వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు.  
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఇంట్లో ఒంటరిగా వారిని ఉంచడం 

ఇష్టంలేక... 
ఇంట్లో వృద్ధులు ఉంటే వారి ఛాదస్తం భరించాల్సి వస్తుందని భావించి, కొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు.  
మంచంలో ఉన్న వృద్ధులకు సేవలు చేయడం కష్టంగా భావించి  వైద్యసదుపాయాలున్న ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు.  
పేద కుటుంబాల్లో వృద్ధులను భారంగా భావిస్తున్న కుటుంబసభ్యులు కొందరు ఉచిత వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. 
అనారోగ్యంతో శుచి, శుభ్రత తగ్గిన వృద్ధులను ఇంట్లో ఉంచుకుంటే వారి వల్ల తమ పిల్లలు అనారోగ్యం బారిన పడతారని ఇంకొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. 

విదేశాల్లో అలా... 
విదేశాల్లో వృద్ధుల బాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటాయి. ఆస్ట్రేలియాలో వృద్ధులకు అందించే సౌకర్యాలను బట్టి అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల వృద్ధులపై ఆర్థిక భారం తగ్గుతుంది.  
అమెరికాలో వృద్ధుల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. వయస్సులో ఉన్నప్పుడే వారి ఆదాయంలో  ప్రభుత్వం కొంత తీసుకుని వయసు మీరిన అనంతరం వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచి అన్ని రకాల సేవలు అందిస్తుంది.   
వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన ఉండే జిరియాట్రిషియన్స్‌ పర్యవేక్షణలో వృద్ధాశ్రమాలు పనిచేస్తాయి.  
వారికి సేవచేసే సిబ్బంది తప్పనిసరిగా నర్సింగ్‌లో శిక్షణ పొంది ఉండాలి. లేకపోతే అనర్హులు.  
ప్రతీ హోమ్‌కు తప్పనిసరిగా అంబులెన్స్‌ ఉంటుంది. 
అమెరికాలో నిర్వహించే భారతీయుల ఆశ్రమాల్లో యోగా, సాయంత్రం వేళల్లో భజనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
కెనడాలో వృద్ధాశ్రమాలకు పన్నులు, ఉచిత విద్యుత్‌ వంటి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ వృద్ధులు తప్పనిసరిగా యూనిఫారం ధరించాలి. దీనివల్ల అందరం ఒకటేననే భావన ఉంటుంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇండోర్‌ గేమ్స్‌ను అందుబాటులో ఉంచుతారు.  
స్విట్జర్‌ల్యాండ్‌లో వృద్ధులకు 50శాతం ఆరోగ్య బీమా చెల్లిస్తే సరిపోతుంది. దీనికింద అన్ని రకాల వైద్యసేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.   
చాలా దేశాల్లో వృద్ధాశ్రమాల్లో ఉన్నప్పటికీ అక్కడి వారు ఓపిక ఉంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఆదాయం వచ్చే పనులు చేసుకోవచ్చు. 

ఇక్కడ ఇలా... 
మన రాష్ట్రంలో  జిరియాట్రిషియన్‌ స్పెషలిస్టులే లేరు.  
వృద్ధాశ్రమాల్లో పనిచేయడానికి ఏ విధమైన కోర్సులు పూర్తిచేయాల్సిన అవసరంలేదు.   
వృద్ధులకు అనారోగ్యం వస్తే అరకొర వైద్య సేవలే దిక్కు. 
మన దేశంలో ఎక్కువగా తమపని తాము చేసుకోగలిన వారికే వృద్ధాశ్రమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. 
మన రాష్ట్రంలో వృద్ధాశ్రమాల్లో నివసించే వారి సేవలు ఎవరూ ఉపయోగించుకోరు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో వృద్ధులు పాల్గొనేందుకు ఆశ్రమ నిర్వాహకులు అనుమతించరు.  
బీమా సౌకర్యానికి వయో పరిమితి ఉంటుంది. 

పదేళ్లుగా వృద్ధాశ్రమంలోనే.. 
సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన నాకు ఇద్దరు కుమారులు. ఒకరు బ్యాంక్‌ ఉద్యోగం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. రెండో కుమారుడు హైదరాబాద్‌లో చిరుద్యోగి. కుమారుడిపై భారం పడకూడదని భర్తతో కలిసి పదేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నాను. ఏడాదిన్నర క్రితం ఆయన చనిపోయాడు. పిల్లలు, మనవరాళ్లతో గడపాలనే కోరిక ఉన్నప్పటికి వారికి భారం కాకూడదనే ఇక్కడే ఉంటున్నాను.     
– ఆర్‌. సీతామహాలక్ష్మీ, అమ్మ వృద్ధాశ్రమం కేసరపల్లి 

వృద్ధులకు ఆసరాగా హెల్పేజ్‌ ఇండియా  
మా హెల్పేజ్‌ ఇండియా సంస్థ వృద్ధులకు ఆసరాగా ఉంటోంది. వృద్ధులకు అన్యాయం జరిగినా తమ సంస్థ ద్వారా సహాయం పొందవచ్చు. హెల్పేజ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా వృద్ధులకు కావాల్సిన సమాచారం, ఫిర్యాదు చేయవచ్చు. 1800 180 1253 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సహాయం పొందవచ్చు. వృద్ధులతో ఆస్తులు రాయించుకుని వదిలివేసే కుటుంబసభ్యులపైనా, వృద్ధులను సరిగాచూడని వారిపైనా ఫిర్యాదులు చేయవచ్చు.     
– మహ్మద్‌ రజామహ్మద్‌ హెల్పేజ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధి

రేమాండ్స్‌ అధినేత విజయపత్‌ సింఘానియా.. తాను కష్టపడి నిర్మించుకున్న ఇంటిని తన కుమారుడు తీసుకున్నాడని, అలాగే రేమాండ్‌లో తన వాటా షేర్లు ఇవ్వడంలేదంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. 
చివరకు తాను ఒక అద్దె ఇంట్లో జీవనం వెళ్ల దీస్తున్నానంటూ వాపోయారు.  

కేరళకు చెందిన కృష్ణ.. దశాబ్దం క్రితం విజయవాడ వచ్చాడు. ఇక్కడే హోటల్‌లో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ఉన్న ఒక్క కూతురుకు పెళ్లిచేశాడు. భార్య చనిపోయిన తరువాత తన వద్ద ఉన్న ఐదు లక్షలు కుమార్తెకిచ్చి ఆమె వద్దే ఉండేవాడు. కృష్ణకు డబ్బు సంపాదన ఆగిపోవడంతో అతన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో నగరంలోని ఒక అనాథ ఆశ్రమంలో తలదాచుకున్నాడు.  

విజయవాడ నగర శివార్లో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఆయన కుమారుడు వచ్చి మృతదేహాన్ని నగరంలోని తన ఇంటికి తీసుకెళ్లలేనని, నేరుగా కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి 
అక్కడే కర్మకాండలు పూర్తిచేస్తానని చెప్పడంతో బాధపడటం వృద్ధాశ్రమ నిర్వాహకుల వంతైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement