కన్నబిడ్డలతో గృహిణి ఆత్మహత్య | 2 kids and mother died and got suicide note | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డలతో గృహిణి ఆత్మహత్య

Published Sun, Aug 2 2015 3:46 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

కన్నబిడ్డలతో గృహిణి ఆత్మహత్య - Sakshi

కన్నబిడ్డలతో గృహిణి ఆత్మహత్య

బిడ్డలపై కిరోసిన్‌పోసి నిప్పంటించుకొని సజీవదహనం
* వేధింపులు భరించలేకే చనిపోతున్నానని సూసైడ్ నోట్.. గచ్చిబౌలిలో ఘటన

హైదరాబాద్: కట్టుకున్నవాడు వదిలేశాడనే బాధతో కన్న బిడ్డలతో కలసి ఆత్మహత్యకు పాల్పడిందో గృహిణి. నిద్రలో ఉన్న కొడుకు, కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించి తాను కూడా వారితో సజీవ దహనమైంది. ఈ ఘట న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వరంగల్ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన వినోద రాణి(33)కి.. 2004లో మెదక్ జిల్లాలోని జాస్తి లింగారెడ్డిపల్లికి చెందిన జి.నరేందర్‌రెడ్డితో వివాహమైంది.  

వీరికి కూతురు జ్యోతి (10), కొడుకు విఘ్నేశ్ (8) లు ఉన్నారు. కొన్నాళ్లుగా దంపతులు గచ్చిబౌలిలోని సర్వే నంబర్-5లో నివాసం ఉంటున్నారు. కాగా, మద్యం తాగే అలవాటున్న భర్త నరేందర్‌రెడ్డి గతంలో రెండు సార్లు ఇల్లు వదలి వెళ్లిపోయాడు. 10 రోజుల కిందట మళ్లీ ఎవరికీ చెప్పకుండా భార్య, పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన వినోద రాణి... భర్త ఆచూకీ కోసం తెలిసిన వారిని అడిగింది. వేరే మహిళతో వెళ్లిపోయాడని తెలియడంతో మనస్తాపానికి గురైంది. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పడుకున్న బిడ్డలపై కిరోసిన్ పోసింది.

తనపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. ఈ ఘటన జరిగిన గంటన్నర తర్వాత వినోద సోదరుడు మురళీధర్ రెడ్డి అక్కను తనతో పాటు తీసుకెళ్లడానికి వారి ఇంటికి వచ్చాడు. కానీ, ఇంటి తలుపులు ఎన్నిసార్లు తట్టినా ఎవరూ తీయక పోవడం, గది నుంచి దట్టమైన పొగలు రావడంతో అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే అందరూ సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ రమణకుమార్, సీఐ రమేశ్, ఎస్‌ఐ సీహెచ్ వెంకటేశ్ పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, వినోద రాణి శుక్రవారం సాయంత్రం తన తమ్ముడు మురళీధర్ రెడ్డి, మరో సోదరికి ఫోన్ చేసి బాధ పడినట్లు తెలిసింది. కన్న బిడ్డలతో ఆత్మహత్యకు పాల్పడిన వినోద జూలై 28నే సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ రాసిన మూడు రోజులకు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే కోణంలో విచారణ చేపట్టారు.
 
నా చావుకు భర్తే కారణం
* సూసైడ్ నోట్‌లో వినోద

‘నా చావుకు, నా పిల్లల చావుకు నా భర్త జి.నరేందర్ రెడ్డి కారణం. 11 ఏళ్లు నరకం చూపాడు. మన మధ్య అబద్ధాలు ఉండొద్దు. అలా ఉంటే సంసారం పాడవుతుంది అర్థం చేసుకోవాలి కదా.. జీవితానికి మంచి దారి చూపిన మంచి మనిషిని, తాళి కట్టిన భార్యను పచ్చి మోసం చేశాడు. అప్పులు చేసి నన్ను, పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. మా కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నా భర్త, పిల్లలను అందంగా ఊహించుకున్నా.. అందరూ ఉన్నా.. భర్త లేకపోతే ఒంటరిగా అనిపిస్తుంది.

అమ్మా.. డాడీకి మనకంటే బయటి వారే ఎక్కువని పిల్లలు అడుగుతుంటే ఎంతో బాధగా ఉండేది. నాకు అతనిని వదులుకోవడం కంటే నా ప్రాణం వదులు కోవడమే ఇష్టం. వాడికి మాత్రం నన్ను, పిల్లలను వదిలి తిరగడం ఇష్టం. కనీసం మా శవాలను చూడడానికి వస్తాడో, లేదో... భర్తగా, తండ్రిగా మా అంత్యక్రియలు చేస్తాడా? అసలు మేము చనిపోయినట్లు తెలుస్తుందా అతనికి.. అమ్మా, నాన్నా ఇల్లు పూర్తి చేసి, తమ్ముడికి పెళ్లి చేయండి. వాడి పిల్లలతో ఆడుకోవాలి కదా మీరు..’ అని సూసైడ్ నోట్‌లో వినోద తన ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement