
అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
- ఇద్దరు స్నేహితుల దుర్మరణం l
- దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే మృతి
హైదరాబాద్: బోయిన్‌పల్లి నుంచి తాడ్‌బంద్‌కు వెళ్లే ప్రధాన రహదారి.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయం.. ఒకే బైక్‌పై వెళుతున్న ముగ్గురు స్నేహితులు.. ఓ మూలమలుపు వద్ద బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో వారు ముగ్గురూ అవతలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వారిలో ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.
వీకెండ్ కోసం వెళ్లి: మల్కాజ్‌గిరి దుర్గానగర్ బస్తీకి చెందిన రమాకాంత్ కుమారుడు అనిరు«ధ్(20) నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అనిరుధ్ ఇంటి దగ్గర్లోనే ఉండే కృష్ణ రెండో కుమారుడు విశ్వచారి.. సాయిసుధీర్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. పక్కిం టివాళ్లు కావడం తో వీరికి మంచి స్నేహం ఉంది. అమీర్‌పేటకు చెందిన అఖిల్.. అనిరుధ్‌కు కాలేజీలో మిత్రుడు. ఇలా వీరి ముగ్గురి మధ్యా స్నేహబంధం ఏర్పడింది. వీకెండ్ రోజున సరదాగా గడిపేందుకు విశ్వచారి పెద్దమ్మ ఉండే ఫతేనగర్‌కు అనిరుధ్‌తో కలసి విశ్వచారి బస్సులో వచ్చాడు. ఆ తర్వాత అమీర్‌పేట లో అఖిల్‌ను కలుసుకున్నారు.
అఖిల్ తన టీఎస్03 ఈఏ1993 నంబర్ గల యమహా ఎఫ్‌జెడ్‌పై అనిరుధ్, విశ్వచారితో కలసి దుర్గానగర్ బయలు దేరారు. బోయిన్‌పల్లి నుంచి తాడ్‌బంద్‌ను దాటే క్రమంలో తాడ్‌బంద్ బస్టాండ్ రాకముందు ఉండే మూలమలుపు వద్ద అతివేగంతో వచ్చిన వారి బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఎగిరి అవతలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో తాడ్‌బంద్ నుంచి బోయిన్‌పల్లి వైపు భారీ లోడ్‌తో వేగంగా వెళుతున్న లారీ వారి మీది నుంచి దూసుకెళ్లింది. అనిరుధ్, విశ్వచారి ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన అఖిల్‌ను గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పది నిమిషాల్లో వస్తానని ..
‘పది నిమిషాల్లో వస్తాను నాన్నా..’అంటూ 2.30 గం టల ప్రాంతంలో విశ్వచారి తండ్రి కృష్ణకు ఫోన్ చేసి చెప్పాడు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో ఆ కుటుంబం తట్టుకోలేక పోతోంది. రమాకాంత్ కుటుంబానికి అనిరుధ్ ఒక్కడే కుమారు డు కావడంతో గారాభంగా పెంచారు. అతను మరణించిన వార్త విన్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. దీంతో దుర్గా నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
హెచ్చరికలు లేని మూలమలుపు
బోయిన్‌పల్లి నుంచి తాడ్‌బంద్‌కు వెళ్లే దారిలో ఉన్న ఈ మూలమలుపులో అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి హెచ్చరికలు లేవు. ఈ మూలమలుపును విస్తరించాలని ప్రతిపాదనలు రూపొందించినా.. ఒకవైపు ముస్లింలకు చెందిన శ్మశానవాటిక, మరోవైపు రక్షణ శాఖ భూములు కావడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. దీంతో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రధాన రోడ్డులో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.