సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల గడువును కుదించారు. వెబ్ ఆప్షన్లనుంచి మొదలుకొని ప్రవేశాల ముగింపు మొత్తం కార్యక్రమాలను 50 రోజుల్లో పూర్తి చేస్తుండగా ఈసారి 30 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. కాలేజీ యాజమాన్యాలతో ఉన్నత విద్యా మండలి శనివారం నిర్వహించిన సమావేశంలో ఈ అవగాహనకు వచ్చారు. ఏటా ప్రవేశాలు ఆలస్యం అవుతున్నందున రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుండటం, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ కాకపోవడం, ఎక్కువ ఆప్షన్లు ఇచ్చి సీట్లను బ్లాక్ చేయడం వంటి అంశాలపై కోర్టు ఆదేశాల మేరకు మండలి కార్యాలయంలో శనివారం ఈ కీలక సమావేశం జరిగింది. మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి డాక్టర్ రఘునాథ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
వివిధ అంశాలపై యాజమాన్యాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జులై 31 నాటికే ప్రవేశాలను పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులను నిర్వహించాల్సి ఉన్నందున... జూన్ 9వ తేదీన ఎంసెట్ ర్యాంకులు ప్రకటించిన తరువాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టి జులై 15 నాటికే ప్రవేశాలను పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 4న జరిగే సమావేశంలో అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. గత ఏడాది జారీ చేసిన జీఓ-66, 67లను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఐదు దఫాలుగా నిర్వహిస్తున్న మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రెండు దశల్లోనే పూర్తి చేయాలనే అంగీకారానికి వచ్చారు. సీట్ల భర్తీ వివరాలను కాలేజీల వెబ్‌సైట్లతోపాటు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేయాలని, కామన్ పోర్టల్ ద్వారా మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలనే అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. తద్వారా వేర్వేరు కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేయడం వంటి చర్యలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.