60 శాతం మందికి ఆ రోగం ఉన్నట్లే తెలియదు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం హైబీపీకి కేంద్ర బిందువుగా మారుతోంది. నగరంలో 18-40 ఏళ్ల వారిలో 36 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 18-20 శాతం మంది అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు తేలింది. నగరంలో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధికం హైబీపీ వల్లే న మోదవుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, అతిగా మద్యపానం, ధూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న హైబీపీపై కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా ‘బిగ్ బీపీ క్యాంపెయిన్’పేరుతో ఎనిమిది గంటల పాటు సర్వే నిర్వహించింది. 1.80 లక్షల మందిని పరీక్షించింది.
ఇందులో భాగంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మహాత్మా గాంధీ బస్టేషన్, ఐఎస్ సదన్, జూబ్లీహిల్స్ అపోలో, డీఆర్‌డీవో అపోలో, మాదాపూర్‌లతో పాటు మరో 65 కేంద్రాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. 19,846 మందిని పరీక్షించి, వీరిలో 11,245 శాంపిల్స్‌ను విశ్లేషించింది. బాధితుల్లో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 60 ఏళ్ల వారితో పోలిస్తే 18-40 ఏళ్లలోపు వారే మూడు రెట్లు ఎక్కువగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. ఆసక్తి కర అంశమైమంటే బాధితుల్లో 60 శాతం మందికి తమకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు తెలియదు. మందులు వాడుతున్న 42 శాతం మం దిలో బీపీ కంట్రోల్‌లో ఉండటం లేదు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడక పోతే 2025 నాటికి ఈ సంఖ్య జనాభాలో మూడు వంతుల మం ది హైబీపీ బారిన పడే ప్రమాదం లేక పోలేదు.
మహిళల్లోనూ ఇదే ఒరవడి...:
ఇటీవల ఐటీ అనుబంధ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పురుషులతో పోటీ పడి పనిచేస్తున్నారు. ఇటు ఇంటి పనుల్లోనూ, అటు ఆఫీసు పనుల్లోనూ వీరు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జీవనశైలి వల్ల రుతుక్రమంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వంద మంది హృద్రోగ బాధితుల్లో 65 శాతం మంది పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువ .
అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఆకస్మిక మరణాల శాతం 1.2 శాతం ఉంటే, గ్రేటర్‌లో మాత్రం 4.9 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. మహిళల ఆరోగ్యంపై శ్రద్ద చూపక పోవ డం, వైద్య ఖర్చుకు వెనకాడటం, నొప్పి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకు వెళ్తుండటం కూడా ఇందుకు ఓ కారణమని వై ద్యులు అభిప్రాయపడుతున్నారు.