విమానం బాత్రూంలో బంగారం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మస్కాట్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న విమానంలోని బాత్రూంలో నాలుగు కేజీల బంగారాన్ని విమాన సిబ్బంది గమనించి... అనంతరం డీఆర్ఐ అధికారులకు వారు సమాచారం అందించారు. డీఆర్ఐ అధికారులు బాత్రూంలోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తనిఖీల్లో బంగారం పట్టుబడుతుందని భావించిన ప్రయాణికుడు భయపడి బాత్రూంలో వదిలేసి వెళ్లి ఉంటాడని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు.
ఆ దిశగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 26వ తేదీన దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా... బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో సహకరిస్తున్న ఇద్దరు జీఎమ్ఆర్ ఉద్యోగుల పేర్లు వెళ్లడించాడు. దాంతో వారిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.