సొంతంగా 50 హాట్‌స్పాట్స్
- రాజధానిలోఏర్పాటుకు బీఎస్‌ఎన్‌ఎల్ కసరత్తు
- పూర్తయిన టెండర్ల ప్రక్రియ...
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రయివేటు టెలికం సంస్థలకు దీటుగా వినియోగ దారులకు విస్తృత సేవలందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నగరంలో సొంతంగా 50 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎల్‌ఎండ్‌టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. హాట్‌స్పాట్ కేంద్రాలకు అనుసంధానంగా మరో 300 పాయింట్‌లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో పాయింట్ 70 మీటర్ల పరిధి వరకు కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించింది. వీటి ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ స్పీడుతో డేటా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. అయితే... ప్లాన్ చార్జీలు ఇంకా ఖరారు కాలేదు. మార్చిలో హాట్‌స్పాట్‌ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ హైదరాబాద్ పీజీఎం రామచంద్ర తెలిపారు. ఇప్పటికే క్వాడ్జన్ సంస్థతో కలసి ఏర్పాటు చేసిన 45 హాట్‌స్పాట్స్‌తో ఉచిత వైఫై సేవలను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. వీటి ద్వారా రోజుకు 80 నుంచి 100 జీబీ డేటా వినియోగమవుతోంది. ఈ ఉచిత వైఫై సేవలను ప్రస్తుతం 15 నిమిషాలకే పరిమితం చేసింది.
మూడు రకాలుగా...
మహానగరంలో మూడు రకాలుగా హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రణాళిక రూపొందించింది. ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యం మేరకు స్మాల్, మీడియం, లార్జ్ హాట్‌స్పాట్‌లు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్లు... ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధి మేర సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైఫై సేవల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో బీఎస్‌ఎన్‌ఎల్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. సర్వీస్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా ఆయా సంస్థల నుంచి వసూలు చేస్తోంది.