
సిటీలో సగం పార్కింగ్ లేని పోలీసుస్టేషన్లే
నగర ట్రాఫిక్ పోలీసులు ‘ర చ్చ’కె క్కే ముందు ‘ఇంటి’ని సరిదిద్దుకోవడం మర్చిపోతున్నారు. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరన్న’ చందంగా వ్యవహరిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నో-పార్కింగ్ ఏరియాలో వాహనం ఆపితే రూ.1000 చలాన్‌తో సామాన్యులను చావబాదేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు.. పార్కింగ్ వసతులు లేని ఠాణాల వ్యవహారం ఎందుకు పట్టదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. సిటీలో సగానికి సగం ఠాణాలకు సరైన పార్కింగ్ వసతులు లేవు. ఈ కారణంగానే బాధితులతో పాటు పోలీసుల వాహనాలనూ ఆయా ఠాణాల ఎదురుగా ఉన్న రోడ్డుపైనే ఆపాల్సిన పరిస్థితి. ఇదే గత ఏడాది నారాయణగూడ పరిధిలో ఓ యువకుడు ప్రాణాలు కూడా తీసింది. నగరంలోని చాలా పోలీసుస్టేషన్లు నిజాం కాలం నాటి భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
అక్కడున్న మౌలిక సదుపాయాలు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది కూర్చోవడానికే అవకాశం ఉండదు. ఇక పార్కింగ్ ప్లేస్ గురించి ఆలోచించడం అత్యాశే అవుతుంది. ఈ కారణంగానే ఇన్‌స్పెక్టర్ మెబైల్ మొదలు పోలీసు జీపులు, బందోబస్తు సిబ్బందిని తరలించే ఐఛ ర్లు, రక్షక్ వాహనాలు, సిబ్బందికి చెందిన వెహికల్స్‌తో పాటు చివరకు ఫిర్యాదుదారులకు చెందినవి, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి ఇలా అన్ని వాహనాలూ రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని దృష్టిలో పెట్టుకునే గతంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తొలుత ట్రాఫిక్ పోలీసుల నుంచే అమలు చేసేవారు. ఆపై ఇతర విభాగాల అధికారులు, చివరకు సామాన్యుల వద్దకు వచ్చేవారు. కార్లపై ఉండే బుగ్గలైట్ల తొలగింపు, అడ్డదిడ్డంగా ఉండే నెంబర్ ప్లేట్లు, అద్దాలపై ఉన్న నల్లరంగు ఫిల్మ్‌లపై స్పెషల్ డ్రైవ్ తదితర కార్యక్రమాలు చేపట్టేముందు పోలీసుల వాహనాలపై తీయించేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత మాత్రమే నగరవ్యాప్తంగా అమలు చేశారు.
అయితే ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు ఆపిన సామాన్యులను చలాన్లతో చావబాదేస్తూ.. తమ సొంత శాఖలో ఉన్న ఉల్లంఘనలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అనేక పోలీసుస్టేషన్లు రోడ్లనే తమ పార్కింగ్ ప్రాంతాలుగా మార్చుకున్నా వీరికి పట్టట్లేదు. ఇందుకు నారాయణగూడ, రామ్‌గోపాల్‌పేట్, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, చార్మినార్, ఎస్సార్‌నగర్ తదితర పోలీసుస్టేషన్లు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ పాత భవనాల్లో కొనసాగుతున్న ఠాణాలే అని అధికారులు సర్దిచెప్పాలని చూసినా... కొత్తగా నిర్మించిన వాటిలోనూ సరైన వసతులు ఉండట్లేదు. సిద్ధి అంబర్‌బజార్ ప్రధాన రహదారిపై నిర్మించిన బేగంబజార్ పోలీసుస్టేషన్‌కూ సరైన పార్కింగ్ వసతి లేదు.
సాధారణంగా రోడ్డుపై ఎవరైనా వాహనాన్ని ఆపినా, తీయడానికి కాస్త ఆలస్యం చేసినా చుట్టుపక్కల వాహనచోదకులు అప్రమత్తమవుతారు. వాటిని తీసేవరకు నానా రాద్దాంతం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలా ఏర్పడిన తగాదాలే పెద్ద గొడవలుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. అదే పోలీసుస్టేషన్ ఎదుటో, పోలీసులకు చెందిన వాహనమో ఇలా ఆగినా మాట్లాడే ధైర్యం ఎవరికుంటుంది? ఇదే అధికారుల ధీమా. ఈ విషయంపై ఉన్నతాధికారులే ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. తమ శాఖలోని తప్పుల్ని మాత్రం పట్టనట్లు వదిలేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, సామాన్యులపై మాత్రం చలాన్లతో విరుచుకుపడుతున్నారన్న సిటీజనుల విమర్శకు ట్రాఫిక్ విభాగమే సమాధానం చెప్పాలి.