బీరు పారుతోంది!
♦ 50 రోజుల్లో 5 కోట్ల లీటర్లు స్వాహా
♦ గత రెండున్నర నెలల్లో రూ. వెయ్యి కోట్ల విక్రయాలు
♦ రంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్‌లో10 లక్షల కేసులు హాంఫట్
♦ ఈ నెల వర్షాల వల్ల స్వల్పంగా తగ్గిన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో వేసవి ఎండలు మండిపోవడంతో మందుబాబులు చల్లని బీర్ల కోసం ఎగబడ్డారు. దీంతో రాష్ట్రంలో 50 రోజుల్లో ఏకంగా 5 కోట్ల లీటర్ల బీర్లను గుటకాయ స్వాహా చేశారు. ఏప్రిల్‌లో ఏకంగా 3.5 కోట్ల లీటర్ల బీర్లను తాగేసిన బీరుప్రియులు ఈ నెలలో ఇప్పటివరకు 1.5 కోట్ల లీటర్ల మేర బీర్లు లాగించేశారు. ఈ నెలలో అడపాదడపా వర్షాలు కురవడంతో బీర్ల డిమాండ్ కొంత తగ్గినప్పటికీ నెలాఖరుకల్లా మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వేసవి బీర్ల అమ్మకాల్లో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. ఐటీ కంపెనీలతోపాటు కార్పొరేట్ కంపెనీలు అధికంగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లలో ఏప్రిల్‌లోనే 10 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మేలోనూ బీర్ల విక్రయాల్లో దాదాపు అదే జోరు కొనసాగింది.
3 నెలల్లో 96 లక్షల కేసుల బీర్ల విక్రయాలు
గతేడాది ఏప్రిల్‌లో 29.27 లక్షల కేసులు (ఒక కేసులో 7,800 ఎంఎల్) బీర్ల విక్రయాలు జరగ్గా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 44.9 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మార్చి నుంచే రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత పెరగడంతో మద్యం ప్రియులు కూడా బీర్లను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే (19వ తేదీ వరకు)లలో 96 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మార్చిలో 31 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా మేలో 19 రోజుల్లో 20 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఈ రెండున్నర నెలల్లో జరిగిన విక్రయాల విలువ సుమారు రూ. 1,000 కోట్లు కావడం విశేషం.
ఏప్రిల్‌లో భారీగా రెవెన్యూ
బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఏప్రిల్‌లో ఆబ్కారీ శాఖకు రూ. 1,217 కోట్ల రెవెన్యూ సమకూరింది. గతేడాది ఏప్రిల్‌లో రూ. 888.63 కోట్ల రెవెన్యూ రాగా ఈసారి దాదాపు రూ. 350 కోట్లు అదనంగా సమకూరింది. మేలో ఇప్పటివరకు రూ. 614 కోట్ల రెవెన్యూ వచ్చింది. రాష్ట్రంలోని 2,144 మద్యం దుకాణాల లెసైన్సుల మూడో విడత రెన్యూవల్స్‌కు గడువు దగ్గర పడడంతో ఈ నెలాఖరు వరకు టీఎస్‌బీసీఎల్ నుంచి విక్రయాలు ఉండవని ఓ అధికారి తెలిపారు. అయినా గతేడాది కన్నా వృద్ధిరేటు ఉంటుందని తెలిపారు.