
పెద్ద జెండా చిరిగిపోయింది!
- వెంటనే కొత్త పతాకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు
- భారీ గాలుల తాకిడితో అధికారుల్లో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సంజీవయ్య పార్కులో జూన్ 2న సీఎం కేసీఆర్ ఎగరేసిన అతిపెద్ద జాతీయ పతాకం పది రోజులకే చిరిగిపోయింది. ఈ పతాకం ఏర్పాటు చేసిన సమయంలోనే ముందుజాగ్రత్త చర్యగా రెండు పతాకాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రెండోదాన్ని ఎగురవేశారు. ఇప్పుడు అది ఎన్ని రోజులుంటుందో తెలియక అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆరు జాతీయ పతాకాలను సిద్ధం చేయాలని నిర్ణయించుకుని.. తొలి పతాకాన్ని తయారు చేసిన ఖమ్మంలోని వ్యక్తికి మూడు పతాకాలకు ఆర్డరిచ్చారు. ఇలాంటి భారీ పతాకాలను రూపొందించటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మరో మూడు జెండాలకోసం ఆర్డర్ ఇచ్చారు. వెంటనే వాటిని పంపాలని కోరడంతో ఆదివారం నాటికి ముంబై నుంచి ఒక పతాకం వచ్చింది. త్వరలో అక్కడి నుంచి మరో రెండు, ఖమ్మం నుంచి మూడు పతాకాలు రానున్నాయి.
భారీ వ్యయం
ఇక్కడ ఏర్పాటు చేసిన పతాకాన్ని ప్రత్యేక పాలిస్టర్ వస్త్రంతో రూపొందించారు. 72 బై 108 ఫీట్ల మేర ఉన్న ఈ భారీ పతాకానికి రూ.1.15 లక్షల వ్యయమవుతోంది. కొద్దిపాటి చిరుగుతో దాన్ని తొలగిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. దీంతో నిబంధనల్లో మినహాయింపు మేరకు పాతదాన్ని మరమ్మతు చేసి మరోసారి వాడాలని నిర్ణయించారు. కాగా, పతాకం కోసం ఏర్పాటు చేసిన 291 అడుగుల ఎత్తయిన స్తంభం కూడా తొలుత స్వల్పంగా ఒరిగింది. 11 జాయిం ట్లతో రూపొందిన ఈ భారీ స్తంభం.. ఏర్పాటు సమయంలోనే ఒరిగిందని, ప్రస్తుతం దానికి గాలి వల్ల ఎలాంటి ఇబ్బంది క లగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పతాకం రాత్రి వేళ చీకటిలో ఉండకూడదనే నిబంధన ఉన్నందున ఒక్కోటి వెయ్యి వాల్టుల సామర్థ్యమున్న ఎనిమిది భారీ లైట్లనుఏర్పాటు చేశారు. దాంతో రాత్రి వేళ కూడా భారీ లైట్ల కాంతితో పతాకం ధగధగలాడుతోంది.