♦ చార్మినార్ సమీపంలోని బండి కా అడ్డాలో బయటపడిన వైనం
♦ కుతుబ్‌షాహీల కాలం నాటిదే అంటున్న స్థానికులు
శాలిబండ : చార్మినార్ సమీపంలోని బండి కా అడ్డాలో ఆదివారం ఓ సొరంగం వెలుగుచూసింది. పోలీస్ బ్యారెక్ నిర్మాణం కోసం స్థలాన్ని తవ్వుతుండగా భారీ సొరంగం ఆనవాళ్లు కన్పించాయి. విషయం తెలిసి స్థానికులు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ముర్గీచౌక్ బండి కా అడ్డా ప్రాంతంతో గతంలో పోలీస్ క్వార్టర్స్ ఉండేవి. ఈ క్వార్టర్స్ ఏళ్ల క్రితమే కూలిపోవడంతో ప్రస్తుతం బ్యారెక్స్ నిర్మించేందుకు పోలీస్ అధికారులు కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులను అప్పగించారు.
ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం జేసీబీతో స్థలాన్ని తవ్వుతుండగా రాతి కట్టడంతో కూడిన సొరంగం బయటపడింది.సిబ్బంది వెంటనే పనులను ఆపివేసి పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని సొరంగాన్ని పరిశీలించారు. కాగా ఈ విషయమై పురావస్తు శాఖ అధికారులకు దక్షిణ మండలం పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ కూడా అధికారులెవ్వరూ కూడా ఆదివారం రాత్రి వరకు కూడా ఘటనా స్థలానికి రాలేదు.
గతంలో పోలీస్ క్వార్టర్స్ ఉండేవి...
దశాబ్ధాల కాలం నాటి నుంచి ఈ ప్రాంతంలో పోలీస్ క్వార్టర్స్ ఉండేవని చార్మినార్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు. కాలక్రమేణ ఆ నిర్మాణాలు కూలిపోయాయన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చేపడుతుండగా రాతి కట్టడాలతో కూడిన సొరంగాలు బయటపడ్డాయన్నారు. అప్పటి క్వార్టర్స్ అయి ఉండవచ్చన్నారు.
కుతుబ్‌షాహీల కాలం నాటివే...:స్థానికులు
సొరంగాన్ని వీక్షించేందుకు వచ్చిన స్థానికులు మాత్రం ఇది ముమ్మాటికీ కుతుబ్‌షాహీల కాలం నాటిదేనని పేర్కొన్నారు. చార్మినార్ కట్టడానికి కూతవేటు దూరంలో ఈ సొరంగం బయటపడడమే ఇందుకు నిదర్శనమన్నారు. కుతుబ్‌షాహిల కాలంలో చార్మినార్ కట్టడం నుంచి గోల్కొండ కోటకు భూ అంతరా్భాగంలో సొరంగం నిర్మించారన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయని, ప్రస్తుతం బయటపడిన ఈ సొరంగాన్ని దృష్టిలో ఉంచుకొని పురాతత్వ శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టి పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
తవ్వకాలలో తరచూ బయటపడుతున్న సొరంగాలు
కాగా చార్మినార్ పరిసరాలలో తరచూ సొరంగాలు బయటపడుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేలాపురాలో నడిరోడ్డుపై భారీ గోతి ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పురావస్తు శాఖ అధికారులు సొరంగాన్ని పరిశీలించి ముందుకు వెళ్లడానికి మార్గం లేదని తేల్చారు. కాగా గతంలో కూడా చార్మినార్ కట్టడం సమీపంలో భారీ సొరంగం ఏర్పడింది.
సొరంగం
Published Mon, Apr 13 2015 1:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM