
ఆధార్ ఉంటేనే ‘పది’కి అనుమతి!
పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ మరో విషమ పరీక్ష పెట్టింది.
టెన్త్ విద్యార్థులకు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
ఆధార్ లేకుంటే స్కూళ్ల నామినల్ రోల్స్‌నూ స్వీకరించొద్దని ఆదేశం
ఆధార్ లేని లక్షన్నర మంది విద్యార్థులకు ఈ నిర్ణయం శరాఘాతం
ప్రభుత్వ ఉత్తర్వులు సరికాదంటున్నప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్:
పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ మరో విషమ పరీక్ష పెట్టింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో తమ వివరాల నమోదు కోసం కుస్తీ పడుతున్న విద్యార్థులకు తాజాగా ఆధార్ నంబర్ ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని మెలిక పెట్టింది. టెన్త్ పరీక్షలకు సంబంధించిన ఐసీఆర్ ఫారాల్లో విద్యార్థుల ఆధార్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని, లేనిపక్షంలో ఆయా పాఠశాలల నుంచి నామినల్ రోల్స్‌ను స్వీకరించవద్దని అన్ని జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ఆధార్ పూర్తి చేసినట్లు ధ్రువపత్రం తీసుకున్నాకే నామినల్ రోల్స్‌ను అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్‌కు కూడా విద్యాశాఖ సూచించింది.
ఆధార్ తప్పనిసరి కాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ విద్యాశాఖ డెరైక్టర్ మాత్రం టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తగిన సహకారం అందించేందుకు తాము సిద్ధమని...కానీ పరీక్షలకు, ఆధార్‌కు లింకు పెట్టడం ఎంతమాత్రం సరికాదని పేర్కొంటున్నాయి. విద్యాశాఖ డెరైక్టర్ తాజా ఉత్తర్వుల మేరకు ఏదైనా పాఠశాలలో 30 మంది టెన్త్ విద్యార్థులు ఉండి వారిలో ఏ ఒక్క విద్యార్థికి ఆధార్ లేకున్నా మిగిలిన 29 మంది విద్యార్థుల నామినల్ రోల్స్‌ను కూడా స్వీకరించే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
2వ తేదీలోగా ఆధార్ తేవడమెలా?
నామినల్ రోల్స్ సమర్పణకు డిసెంబర్ 2వ తేదీ గడువుకాగా ఈలోగానే టెన్త్ విద్యార్థులందరికీ ఆధార్ తేవడమెలాగని ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరవుతుండగా, వీరిలో 1.5 లక్షల మందికి ఆధార్ నంబర్లు లేవ ని సమాచారం. పైగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నా యూఐడీ నంబర్‌ను ఇప్పటికిప్పుడు తీసుకొచ్చే పరిస్థితి లేదు. డిసెంబర్ 15లోగా ఆధార్ నంబర్ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న విద్యాశాఖ మరోవైపు డిసెంబర్ 2లోగా ఆధార్ నంబర్లు సహా నామినల్ రోల్స్ సమర్పించాలని గడువు విధించడం అనాలోచిత నిర్ణయమని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) విమర్శించింది.
వాస్తవానికి నామినల్ రోల్స్ సమర్పించేందుకు ఈనెల 26 ను చివరి తేదీగా పేర్కొన్న విద్యాశాఖ... ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాల నమోదుకు సంబంధించి వెబ్‌సైట్ సర్వర్ పనిచేయకపోవడంతో గడువును డిసెంబర్ 2 వరకు పొడిగించింది. తాజాగా ఆధార్ నంబర్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో గడువును మరింత పొడి గించేదీ, లేనిదీ అధికారులు స్పష్టం చేయలేదు.