
స్పీడ్..కిల్స్
జూబ్లీహిల్స్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదం
∙ రాజధాని రోడ్లపై పరిమితికి మించి దూకుడు
∙ నిన్న నిశిత్ నారాయణ, నేడు భరత్ రాజ్ ఉదంతాలు
∙ ఓ స్థాయి దాటితే ఎయిర్‌బెలూన్లూ కాపాడలేవు
సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదం... ఓఆర్‌ఆర్‌పై శనివారం రాత్రి జరిగిన సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజ్ ఉదంతం... ఈ రెండింటికీ ప్రధాన కారణం మితిమీరిన వేగమే. కేవలం ఈ రెండే కాదు... ఏటా నగరంలో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం వేగం కారణంగానే జరుగుతున్నాయని అధికారులు పేర్కొం టున్నారు. ఎంత ఖరీదైన కారైనా.. దాని వేగం శృతి మించితే ఎయిర్‌బెలూన్లు సైతం కాపాడలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిలోని రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువని, 65 కిమీ వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆ రెంటికీ సంబంధం లేదు
రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 18 కిమీ మించట్లేదు. రహదారులు దుస్థితి, నిర్మాణంలో ఉన్న మెట్రోరైల్ పనులు, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు ఇందుకు కారణం. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవికాగా, కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాల స్థాయి అంతకంటే ఎక్కువే. రహదారులు స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంత లేకపోయినా వీటిని నియంత్రించే అవకాశం లేదని, ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం, నియమ నిబంధనలు లేవని అధికారులు పేర్కొంటున్నారు.
రాత్రి వేళల్లోనే ఎక్కువ..
వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు. కేవలం ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. గత నెలలో చోటు చేసుకున్న నిశిత్ నారాయణ ప్రమాదం, సోమవారం తెల్లవారుజామున జరిగిన చింతలకుంట ఘటన రాత్రి జరిగినవే..
ఎయిర్‌బ్యాగ్సూ ఏం చేయలేవు
హైఎండ్ కార్లకు అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటున్నాయి. వాటిలో ఎయిర్‌బ్యాగ్స్ ప్రధానమైనవి. మొన్నటి నిశిత్ నారాయణ ప్రమాదం, తాజాగా భరత్ రాజ్ ఉదంతం రెండింటిలోనూ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయినా వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయం లోపే డ్రైవర్ స్టీరింగ్‌కు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్‌కు బలంగా ఢీ కొట్టుకోవడం జరిగిపోతుంది. ప్రమాదం జరిగే సమయానికి నిశిత్ నారాయణ వాహనం గంటకు 146 కిమీ వేగంతో, భరత్ వాహనం 145 కిమీ వేగంతో ఉన్నాయి. ప్రమాదంతో వాహనం చిద్రమైపోయిన సందర్భాల్లోనూ ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
రెస్పాన్డ్ కావడానికి కొంత సమయం...
ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో యాదృచ్ఛికంగానే ముందు వస్తున్న ప్రమాదాలను గమనిస్తూనే ఉంటాడు. ఎదుటి వాహనం, గుంత... ఇలాంటి ఏవైనా ముప్పులు కనిపించినప్పుడు వెంటనే స్పందించి బ్రేక్ వేయడానికో, పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇలా ముప్పును గుర్తించిన తర్వాత, బ్రేక్ వేయడం వంటి స్పందనకు మధ్య కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి కొంత సమయం పడుతుంది.. ఈ నేపథ్యంలో నిర్ణీత దూరంలోనే ముప్పును గుర్తించి, అవసరమైన ముందే బ్రేక్ వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.