అక్రమాలే పెట్టుబడి కోట్లు రాబడి | ACB Officials revealed assets of three Sub Registrars | Sakshi
Sakshi News home page

అక్రమాలే పెట్టుబడి కోట్లు రాబడి

Published Thu, Jun 29 2017 12:54 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

అక్రమాలే పెట్టుబడి కోట్లు రాబడి - Sakshi

అక్రమాలే పెట్టుబడి కోట్లు రాబడి

- అడ్డగోలుగా వెనకేసుకున్న ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లు
అక్రమాస్తులు రూ.100 కోట్లపైనే
బంధువులు, డాక్యుమెంట్‌ రైటర్లే బినామీలు
ఇళ్లు, భూములు, కంపెనీల్లో భారీగా పెట్టుబడులు
ముగిసిన ఏసీబీ కస్టడీ.. ఆస్తులు బయటపెట్టిన అధికారులు
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టిన సబ్‌ రిజిస్ట్రార్ల ఆస్తులు వందల కోట్లకు చేరాయి. మియాపూర్‌ భూ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్ల బినామీలు, వారి ఆస్తులను ఏసీబీ వెలుగులోకి తెచ్చింది. ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆస్తులు రూ.25 కోట్లు దాటిపోయాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లు శ్రీనివాస్‌ రావు, రమేశ్‌ చంద్రారెడ్డి, యూసఫ్‌లను ఏసీబీ మూడ్రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. బుధవారం వీరి కస్టడీ ముగి యడంతో విచారణలో వెలుగులోకి వచ్చిన ఆస్తుల వివరాలను ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌రావు మీడియాకు విడుదల చేశారు.
 
శ్రీనివాస్‌రావు.. కళ్లు చెదిరే ఆస్తులు
కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ రావు ఆస్తులు రూ.25 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. ఆరు ఇళ్ల స్థలాలు, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండలంలోని మూసాపేట్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, 12 బ్యాంకు ఖాతాలున్నాయని గుర్తిం చింది. తన కుమారుడు కనిష్కతోపాటు మరి కొందరిని ఈయన బినామీలుగా పెట్టుకు న్నట్టు తెలిపింది. హాసిని పవర్‌ ప్రాజెక్ట్, నార్త్‌ స్టార్‌ హోమ్స్, మంజీరా హోల్డింగ్స్, ఐ–కాన్‌ నిర్మాణ కంపెనీల్లో రూ.14 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించింది. అలాగే మన్సూ రాబాద్‌లో రూ.15 లక్షల విలువైన ఇల్లు, సంగారెడ్డి జిల్లాలోని మల్కాపూర్‌లో 33 ఎక రాల వ్యవసాయ భూమి, సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో రూ.3.65 కోట్ల కమర్షియల్‌ కాంప్లెక్స్, రూ.1.3 కోట్ల ఇన్సూరెన్స్‌ బాండ్లు, రూ.2.38 కోట్ల బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.90 లక్షల విలువైన క్రెడిట్‌ కార్డులు, రూ.14 లక్షలతో తిరిగిన విదేశీ టూర్ల వివరాలు, పెళ్లిళ్లకు చేసిన రూ.30 లక్షల ఖర్చు వివరాలను బయటకు తెచ్చింది. రూ.30 లక్ష ల విలువైన ఫార్చూనర్‌ కారు, రూ.7 లక్షల జిప్సీ కారు, రూ.లక్ష విలువైన రెండు బైకులు, రూ.10 లక్షల విలువైన బంగారు అభరణా లను ఏసీబీ గుర్తించింది. అక్రమార్జనతో షెల్‌ కంపెనీలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిం చినట్టు ధ్రువీకరిం చింది. మార్కెట్‌ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.75 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది.
 
యూసఫ్‌.. రూ.25 కోట్లపైనే..
బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన మహ్మద్‌ యూసఫ్‌కు ఇప్పటికే హుమాయు న్‌నగర్, గుడిమల్కాపూర్‌లో జీ+1 ఇల్లు, బషీర్‌బాగ్‌లో ఒక ఫ్లాట్, బండ్లగూడలో ఒకటి, రాయదుర్గంలో ఒక ఇల్లు, శంకర్‌పల్లిలో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు బైకులు న్నట్టు గుర్తించారు. మూడ్రోజుల కస్టడీలో మరిన్ని ఆస్తులు బయటపెట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రూ.కోటి విలువైన రెండెకరాల భూమి, బ్యాంక్‌ ఖాతాలో రూ.49 లక్షల నగదు, రూ.6 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.5 లక్షల విలువైన కారు, రూ.30 వేల విలువైన రెండు బైకులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన రూ.30 లక్షలతో తన కుమా రుడిని వైద్య విద్య చదివిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తన మామను బినామీగా పెట్టుకొని యూసఫ్‌ ఈ ఆస్తులు కూడబెట్టి నట్టు ఏసీబీ తెలిపింది. యూసఫ్‌ ఆస్తులు రూ. 12 కోట్లు ఉంటుంటాయని తెలిపింది. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.25 కోట్లకు పైగానే ఉండ వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
రైటర్లే బినామీలు
మేడ్చల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రమేశ్‌ చంద్రారెడ్డి కొత్త పంథాలో అక్రమార్జనకు తెరదీశాడు. డాక్యుమెంట్‌ రైటర్లను బినామీలుగా మార్చుకొని వారి పేరిట భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు బయటపెట్టారు. గతంలో సోదాలు చేసిన సమయంలో రూ.3.65 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు, పదెకరాల వ్యవసాయ భూమి, ఒక ఇంటి స్థలం, మూడున్నర కేజీల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.1.07 కోట్ల నగదు, రూ.30 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రెండు ద్విచక్ర వాహనాలు గుర్తించినట్లు తెలిపారు. తాజాగా కస్టడీలో విచారించగా నాగోలులో ఒక ఇల్లు, ఎల్బీనగర్‌ రాక్‌టౌన్‌ కాలనీలో ఫ్లాట్, కర్మన్‌ఘాట్‌లోని అగ్రికల్చర్‌ కాలనీలో ఒక ఫ్లాట్‌ ఉన్నట్టు గుర్తించారు.

అలాగే ఆయన తన డ్రైవర్‌ను బినామీగా పెట్టుకున్నట్టు గుర్తించి అతడి ఖాతా ద్వారా రూ.కోటి పైగా నగదు చలామణి అయినట్టు వెల్లడించారు. ఈ కోటి రూపాయలను రమేశ్‌ తన పిల్లల వైద్య విద్య కోర్సుకు ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నారై బంధువుల పేరిట కూడా భారీగానే ఆస్తులు జమ చేసినట్టు ఏసీబీ తెలిపింది. రమేశ్‌ మొత్తం ఆస్తులు రూ.12 కోట్ల వరకు ఉంటాయని, అయితే మార్కెట్‌ విలువ ప్రకారం ఇవి రూ.25 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement