బాబోయ్... సెల్ఫీ డ్రైవింగ్
బాబోయ్... సెల్ఫీ డ్రైవింగ్
Published Sat, Aug 5 2017 12:23 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM
సర్వేలో తేలిన ఆసక్తికర అంశాలివే...
- డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడటం... సెల్ఫీలు దిగడం
- మెట్రో నగరాల్లో ప్రాణం తీస్తున్న నయా పోకడలు
- 70 శాతం మంది తీరిదే..
- తాజా అధ్యయనంలో వెల్లడి
► దేశంలో పలు మెట్రో నగరాల్లో 60నుంచి 70 శాతం మంది చోదకులు వాహనాలను నడుపుతూ, రోడ్డు దాటుతూ ఫోన్లు మాట్లాడుతున్నారట. వీరిలో చిన్నారులు, ట్రక్, బస్ డ్రైవర్లే అధికం.
► డ్రైవింగ్‌లో 18 శాతం మంది ఒకసారి ఫోన్ రింగ్ కాగానే సెల్ మాట్లాడుతున్నారట.
► ప్రయాణంలో ఉన్నప్పుడు 51 శాతం మంది మూడుమార్లు రింగయిన తరువాత ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారట.
► 14 శాతం మంది ప్రయాణంలో ఉన్నప్పుడు, వాహనాలను నడుపుతున్నప్పుడు కూడా సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారట.
సాక్షి, హైదరాబాద్: కార్నెగి మిలన్ వర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (తిరుచ్చి), ఇంద్రప్రస్త ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఢిల్లీ)లు దేశంలోని 12 మెట్రో నగరాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అధ్యయనం చేశాయి. ఇందులో విస్తుగొలిపే అంశాలెన్నో బహిర్గతమయ్యాయి. వాహనం నడిపే ట ప్పుడు, రోడ్డు దాటేటప్పుడు మహానగరాల్లో 60 నుంచి 70 శాతం మంది సెల్‌ఫోన్ మాట్లాడుతున్నట్టు తేలింది. అలాగే సెల్ఫీలు దిగుతూ జరిగిన ప్రమాదాల్లో 50 శాతం భారత్‌లోనే చోటుచేసుకున్నట్టు అధ్యయనం వెల్లడించింది.
కొన్నిసార్లు సెల్ఫీలూ ప్రమాదమే
బహుళ అంతస్తుల భవనాలు, లిఫ్టులో ప్రయాణిస్తున్నప్పు డు, వాహనాలు నడుపుతున్నప్పుడు, చెరువులు, వాటర్ ఫాల్స్, డ్యామ్స్ వద్ద సెల్ఫీ తీసుకునే సరదా కొన్నిమార్లు ప్రాణాంతకమౌతోందని తాజా సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీలు దిగే సమయంలో జరుగుతున్న ప్రమా దాల్లో 50 శాతం భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయంటే దేశంలో ఈ సరదా ఎంతలా ఉందో∙అర్థం చేసుకోవచ్చు. వాటర్‌ఫాల్స్, డ్యామ్‌ల వద్ద గ్రూపులుగా సెల్ఫీలు దిగుతున్న సమయంలో అత్యధికులు మృత్యువాత పడుతున్నట్లు తేలింది. ప్రేమికులు, స్నేహితులు రైల్వే ట్రాక్‌లపై తరచూ సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నట్టు అధ్యయనం పేర్కొంది.
గ్రేటర్‌లో 129 మందికి గాయాలు
గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సెల్‌ఫోన్ డ్రైవింగ్, రోడ్డు దాటుతున్నప్పుడు ఫోన్లు మాట్లాడడం, ప్రయాణిస్తున్న సమయంలో సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ వంటి కారణాలతో ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాది ఇలాంటి సంఘటనల్లో సుమారు 129 మంది తీవ్రగాయాల పాలైనట్లు తెలిసింది. ఇందులో 35 మంది వరకు మృత్యువాతపడ్డారు.
ఫ్యాషన్‌గా మారిపోయింది
వాహనచోదకులకు సంబంధించి ఒకప్పుడు డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడింగ్ మాత్రమే అత్యంత ప్రమాదకరంగా భావించేవాళ్లం. ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ వినియోగం ఈ రెంటినీ మించిపోతున్న పరిణా మాలుగా కనిపిస్తు న్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడటం, సెల్ఫీలు దిగడం, చాటింగ్‌లు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రస్తుతం రహదారిపై పాదచారులు సెల్‌ఫోన్ వినియోగిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో వీరిని కట్టడి చేయడానికి పెడస్ట్రియన్ చట్టాలు వచ్చే ఆస్కారం ఉందనే భావన కలుగుతోంది.
– ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ డీసీపీ
Advertisement
Advertisement