
దేశవ్యాప్తంగా ‘నీట్’ వర్తిస్తుంది
►లోక్‌సభలో ఎంపీ వినోద్ ప్రశ్నకు కేంద్రం స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకశ్మీర్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ద్వారానే వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో శుక్రవారం టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ సంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జేపీ నడ్డా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు ఈ ప్రవేశ పరీక్ష వర్తిస్తుందా? వర్తిస్తే వివరాలేంటి?’’ అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
దీనికి జేపీ నడ్డా సమాధానం ఇచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో భారత వైద్య మండలి యూజీ, పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ‘నీట్’ నిర్వహించాలని నోటిఫై చేసింది. 21.12.2010న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఇది వర్తిస్తుంది. ఎంసీఐ 27.02.2012న సవరించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ‘నీట్’ 2013-14 నుంచి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు 18.07.2013న ‘నీట్’ అమలును నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఎంసీఐ దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. 11.04.2016న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్‌పై విచారణకు అనుమతిస్తూ 18.07.2013 నాటి తీర్పును రీకాల్ చేసింది. అలాగే 28.04.2016న సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ... ‘నీట్’ను రెండు విడతల్లో నిర్వహించేందుకు అనుమతించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.