ఫామ్ స్కూల్
రైస్ ఏ చెట్టుకు పండుతుంది డాడీ?
మిల్క్ ఏ కంపెనీలో
తయారు చేస్తారు మమ్మీ?
అంటూ ప్రశ్నించే చిన్నారులను చూస్తుంటే వారిఅమాయకత్వానికి బాధపడాలో.. మన విద్యావ్యవస్థ ఇంతేనని సరిపెట్టుకోవాలో తెలియదు. కానీ, ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. మట్టితో మనకున్న బంధాన్ని, ప్రకృతి మనకందిస్తున్న ‘అమృతాన్ని’.. రైతన్నల కష్టాన్ని.. అ చిట్టిబుర్రలకు విడమరచి చెప్పాల్సిందే. అందుకు సరైన వేదిక యాక్టివ్ ఫామ్ స్కూల్.
గచ్చిబౌలిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొలువుదీరిన చోట పల్లె అందాలు పుణికి పుచ్చుకున్నట్లు ఉంటుంది ఆ ప్రాంతం. గేదెలు.. మేకలు.. బాతులు.. కోళ్లు.. ఇలా పల్లెటూరు మహా నగరానికి పార్సిల్ అయిందా అన్నట్టు కనిపిస్తుంది. వంశీ అనే యువకుడి ఆలోచనలకు, ఆశయానికి ప్రతిరూపం ఈ యాక్టివ్ ఫాం స్కూల్. త్రీ ఇడియట్స్ మూవీలోని స్కూల్‌లానే ఉంటుంది ఇక్కడి సాగుబడి. రూ.200 రుసుముతో ఏ స్కూల్ విద్యార్థులైనా ఇక్కడ సాగు పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 2.30 వరకు సాగుబడి పనిచేస్తుంది. చిన్నారులు తమంతట తాము విత్తనాలు ఎలా నాటాలో, ఎలాంటి ఎరువులు ఉపయోగించాలో, వ్యవసాయం ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చిన్నారులు తెలుసుకోవచ్చు. ఇందుకోసం మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పిల్లలు కలం పట్టాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా కూర్చుని పాఠాలు వినాల్సిన పనీలేదు. కేవలం ప్రకృతితో మమేకం కావాలి. అప్పుడే తాము తినే తిండి, కట్టుకునే బట్ట.. తాగేపాలు ఎలా వస్తున్నాయో తమ చేతలతో ఇక్కడ తెలుసుకుంటారు.
ఏం చేస్తారిక్కడ..
‘తినడానికి తిండినిస్తున్న భూమాతకు, రైతన్నలకు కృతజ్ఞతలు’ అంటూ ప్రార్థనతో సాగుబడిలో పాఠాలు మొదలవుతాయి. తర్వాత చిన్నారులు మట్టితో స్నేహం చేస్తారు.. అరక పట్టి సాగుబడిలో ఓనమాలు దిద్దుతారు. కాసేపు విశ్రమించాక స్నాక్స్ తీసుకుంటారు. తర్వాత పాడి సంబంధిత అంశాలను తెలుసుకుంటారు. తమ చేతులతో గేదెలకు దాణా పెడతారు. పాఠాలు ముగిసేలోపు ప్రకృతి మనకందిస్తున్న ప్రసాదమేంటో తెలుసుకుంటారు. చివరకు చిట్టిబుర్రలోని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని సంతోషంగా ఇంటికి వెళతారు.
ప్రతి విద్యార్థీ రావాలి
మట్టితో మనకున్న బంధాన్ని ప్రయోగాత్మకంగా తెలిపే వేదిక ఇది. మేం సాగుపై పాఠాలు చెప్పినా పిల్లలు సరిగా అర్థం చేసుకోలేరు. ఇక్కడికొస్తే వ్యవసాయం అంటే ఏమిటో, మన ఆహారం ఎలా వస్తుందో విద్యార్థులు చక్కగా తె లుసుకోవచ్చు. ప్రతి విద్యార్థీ ఇక్కడకు రావాలి. - రుకయా (టీచర్)
థ్రిల్లింగ్‌గా ఉంది...
ఫస్ట్‌టైమ్ ఇలాంటి వాతావరణం చూస్తున్నా.. వ్యవసాయం ఎలా చేస్తారో ఇక్కడ తెలుసుకున్నా.. నా చేత్తో గేదెలకు దాణాపెట్టా.. అవి తినడం ఎంతో థ్రిల్ ఇచ్చింది. - సంహిత (విద్యార్థి)
ఇక్కడే తెలుసుకున్నా...
వ్యవసాయమంటే ఏంటో అర్థమయింది. భూమిని ఎలా దున్నుతారో తెలుసుకున్నాం. రైతులు ఎంతకష్టపడుతున్నారో అర్థమైంది. పెద్దయ్యాక అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతా. - శషస్ (విద్యార్థి)
ప్రయోగపూర్వకంగా తెలుసుకోవాలనే...
పిల్లలు జ్ఞానాన్ని పుస్తకాలతో కాకుండా తమ చేతల ద్వారా తెలుసుకోవాలనేది మా ఆశయం. అందుకే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇక్కడ యాక్టివ్ ఫామ్ స్కూల్ ఏర్పాటు చేశాం. సాగుబడి ఎలా సాగుతుందో ప్రయోగపూర్వకంగా నేర్పిస్తాం. ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఒక్కో విద్యార్థి దగ్గర రూ. 200 తీసుకుని.. పాడి,పంట గురించి తెలియజేస్తాం. విద్యార్థులకు స్నాక్స్, వ్యవసాయ ఉపకరణాలు కూడా అందజేస్తాం. - వంశీ, స్కూల్ నిర్వాహకుడు
అడ్రస్: యాక్టివ్ ఫాం స్కూల్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పక్కన,
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్,
గచ్చిబౌలి, ఫోన్: 9652222119