
సర్వీస్ ఛార్జ్!
►హోటళ్లు, రెస్టారెంట్లలో యథేచ్ఛగా దోపిడీ
►బిల్లుపై అదనంగా 5–10 శాతం మేర సర్వీస్ చార్జి?
►కేంద్రం ఆదేశాలు బేఖాతరు
►వినియోగదారుల అప్రమత్తతే కీలకం అంటున్న నిపుణులు
►బలవంతంగా వసూలు చేస్తే చర్యలు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల పేరిట యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. వారంలో ఓ రోజు సరదాగా బయట భోజనం చేద్దామనుకునే వారి జేబుకు చిల్లు పడుతోంది. వాస్తవంగా ఏప్రిల్ చివరివారంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ హోటళ్లలో సర్వీసు చార్జి తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. వినియోగదారులు తాము చెల్చించే బిల్లుపై అదనంగా సేవా రుసుం తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని..వినియోగదారుని ఇష్టానుసారమే దీన్ని చెల్లించవచ్చని స్పష్టంచేసింది. అంతేకాదు సర్వీసు చార్జీలేదన్న సందేశం అందరికీ కనిపించేలా హోటల్ ప్రాంగణంలో హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ వీటిని పాటించిన దాఖలాలు సిటీలో ఎక్కడా కన్పించడం లేదు. మరోవైపు దీనిపై వినియోగదారుల్లోనూ చైతన్యం లేదు. దీనిపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో సర్వీసు చార్జీ విధించినప్పటికీ ఎవరూ ప్రశ్నించడం లేదు.
గ్రేటర్‌లో జేబులు గుల్ల ఇలా...
మహానగరం పరిధిలో సుమారు 500 ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లున్నాయి. వీటిలో అన్నీ కాకపోయినా ఎక్కువ శాతం హోటళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్వీస్‌ట్యాక్స్(సేవాపన్ను), వ్యాట్(విలువ ఆధారితపన్ను)కు అదనంగా సర్వీసు చార్జీ(సేవారుసుం)వడ్డిస్తున్నాయి. వినియోగదారునికి జారీచేసే ప్రతిబిల్లుపై వ్యాట్ 14.5 శాతం, సేవాపన్ను 5.80 శాతం మేర వసూలుచేస్తున్నారు. దీనికి అదనంగా బిల్లు మొత్తంపై హోటల్‌స్థాయి, ప్రాంతాన్నిబట్టి 5–10 శాతం మేర సేవారుసుము పేరిట వసూలు చేస్తూ వినియోగదారుల జేబులు గుల్లచేస్తున్నారు. అంటే రెస్టారెంట్‌లో ఇంటిల్లిపాదీ భోజనం చేస్తే..బిల్లు రూ.2000 అయితే దానిపై అదనంగా రూ.100–200 వరకు సర్వీసు చార్జీ రూపంలో బాదేస్తున్నారన్నమాట.
సర్వసాధారణంగా హోటల్ యాజమాన్యం ప్రతి పదార్థానికి నిర్ణీత ధరను నిర్ణయించే స్వేచ్ఛ కలిగి ఉంటుంది. అంతేకాదు జారీచేసిన ప్రతి బిల్లులో సిద్ధంచేసిన ఆహారపదార్థాలు, డ్రింక్స్‌కు అయ్యే వ్యయం, నిర్వహణ వ్యయం వంటివి దాగిఉంటాయి. హోటల్‌స్థాయిని బట్టి ..అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి మెనూలోని ఆహారపదార్థాలు, డ్రింక్స్‌కు అయ్యే చార్జీ ఉంటుంది. దీనికి అదనంగా సేవాచార్జీలు వసూలుచేయడం దారుణమన్నది కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల సారాంశం. వీటిని ఉల్లంఘించేవారిపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ విభాగం కఠినచర్యలు తీసుకోవాలని, వరుస తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు.