
బయటి విద్యుత్ కొంటే అదనపు సర్‌చార్జి
- యూనిట్‌పై రూ.1.50–రూ.2 వరకు విధిస్తాం
- పరిశ్రమలకు తేల్చిచెప్పిన విద్యుత్ శాఖ
- జూలై నుంచి అమల్లోకి?
సాక్షి, హైదరాబాద్: తాము సరఫరా చేస్తున్న విద్యుత్‌ను కాదని బహిరంగ మార్కెట్ నుంచి నేరుగా విద్యుత్ కొనుగోలు చేసే పరిశ్రమలపై యూనిట్‌కు రూ.1.50 నుంచి రూ.2 వరకు అదనపు సర్‌చార్జి విధిస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ కొంటున్న వినియోగదారులపై ఇప్పటి కే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అదనపు సర్‌చార్జీ విధిస్తుండగా, త్వరలో రాష్ట్రంలో అమలు చేస్తా మని వెల్లడించింది. ఓపెన్ యాక్సెస్‌లో విద్యు త్ కొనుగోలు చేస్తున్న 42 పరిశ్రమల యాజ మాన్యాలతో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు బుధవారం సమావేశమై ఈ విషయాన్ని తెలియజేశారు.
గత ఆర్థిక సంవత్స రంలో ఈ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధా నంలో 3,018 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రైవేటు విద్యుదుత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు రాత్రివేళ తక్కువ ధరకు విద్యుత్ ఎక్సేS్చంజీల నుంచి కొనుగోలు చేసి పగటి పూట మాత్రం డిస్కంల నుంచి విద్యుత్ కొంటున్నాయి. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా పలు విద్యుదు త్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు సమీకరించిన విద్యుత్ రాత్రి పూట నిరుపయోగంగా ఉండిపో తోంది. పలు పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధా నంలో బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో డిస్కంల విద్యుత్ సరఫరా డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో పీపీఏల్లోని నిబంధనల మేరకు డిస్కంలు రూ. 400 కోట్ల వరకు స్థిర చార్జీలను విద్యుదుత్పత్తి కంపెనీల కు చెల్లించాల్సి వచ్చింది.
ఉత్తర– దక్షిణ విద్యు త్ గ్రిడ్లను అనుసంధానం చేస్తూ వార్ధా–డిచ్ పల్లి–మహేశ్వరం 765 కేవీ విద్యుత్ లైన్ అందుబాటులోకి రావడంతో ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లే వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చట్టంలోని నింబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై అదనపు సర్‌చార్జి విధించనున్నామని రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓపెన్ యాక్సెస్‌పై అదనపు సర్‌చార్జి విధిస్తున్నారన్నారు. ఈఆర్సీ ఆమోదంతో జూలై నుంచి దీన్ని అమలు చేసే అవకాశముందన్నారు.