
ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి
పౌరసరఫరాల శాఖలో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖలోని ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఉద్యోగులందరికీ తొలిసారి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు కేటాయించారు. సీనియారిటీతోపాటు దీర్ఘకాలం ఒకేచోట పనిచేయడం, గత పనితీరు, విశ్వసనీయత, డిప్యుటేషన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల కేటాయింపులు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. ఈ విధానాన్ని త్వరలోనే హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికీ వర్తింపజేయనున్నారు.
అధికారులెవరైనా కేటాయించిన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించలేని పక్షంలో డిప్యుటేషన్ విధానం ద్వారా హైదరాబాద్‌లో పనిచేయడానికి ఉన్న వెసులుబాటును రద్దుచేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా పోస్టింగ్‌లలో చేరే ఉద్యోగులందరూ దసరా రోజు ఉదయం 10.41 గంటలకు కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉద్యోగుల పోస్టింగ్‌లు, వారి బాధ్యతలపై సీవీ ఆనంద్ ఆదివారం సుదీర్ఘంగా సమీక్షించి కొత్త జిల్లాల్లో నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరించారు. శాఖలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు 31 జిల్లాలకు సర్దుబాటు చేశామని, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ధాన్యం సేకరణ, నిత్యావసర సరకుల సరఫరా, పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయి గోధాములు, రేషన్ షాపులు తరుచూ తనిఖీ చేయడం, నిత్యావసర సరుకుల పంపిణీపై నిఘా ఉండేలా ద్యోగులకు కొత్తగా జాబ్‌చార్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఉన్న జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌వో) ఇకపై జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్‌వో)గా, సహాయ సరఫరాల అధికారి (ఏఎస్‌వో) సహాయ పౌర సరఫరాల అధికారి (ఏసీఎస్‌ఓ)గా వ్యవహరిస్తారని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న జిల్లా మేనేజర్లు ఇకపై ఉండబోరని తెలిపారు. దీంతోపాటే జిల్లా తూనికల కొలతల శాఖలో జిల్లా స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు అధికారులుగా ఉన్నారని, ఇకపై వారు జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ (డీఎల్‌ఎంవో)గా వ్యవహరిస్తారన్నారు. హైదరాబాద్ సీఆర్వో కార్యాలయంలో సీఆర్వోతో పాటు ఒక డీసీఎస్‌వో, ఎసీఎస్‌వో, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఉంటారని తెలిపారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో కొనసాగుతున్న వినియోగదారుల ఫోరంలలోని 168 మంది సిబ్బందిని కూడా కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.