అన్నిటికీ అడ్వాన్స్ బుకింగే
రవాణా శాఖలో అన్ని సేవలకు స్లాట్ విధానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం.. వివిధ పనుల కోసం వారం కింద ఒకే రోజు 779 మంది ఇక్కడికి వచ్చారు. అదే మూడు రోజుల కింద కేవలం 49 మంది వచ్చారు. జనం భారీగా ఉన్న రోజు తొక్కిసలాట పరిస్థితి.. అదే మామూలు రోజుల్లో సిబ్బంది గోళ్లు గిల్లుకునే పరిస్థితి..
దీనంతటికీ కారణం ఓ పద్ధతి అంటూ లేకుండా ఆర్టీఏ కార్యాలయాలకు జనం రావడమే. దీని వల్ల ప్రజలకు అందించే సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆర్టీఏ అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. తేదీ, సమయం ముందుగానే ఫిక్స్ చేసుకునేలా ‘స్లాట్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయం ప్రకారం వచ్చిన వారికే సిబ్బంది పనిచేసిపెడతారు. లేదంటే తిప్పి పంపుతారు. దీంతో పనులు సజావుగా జరగడమే కాకుండా, సిబ్బందికి కూడా రద్దీ బాధ తప్పుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే వాహనాల లెసైన్సుల జారీకి ఈ విధానం ప్రవేశపెట్టగా, ఇప్పుడు అన్ని రకాల సేవలకు విస్తరించనున్నారు. దాదాపు 17 రకాల సేవలను స్లాట్ విధానం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీని అమలు, ఉపయోగాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదివారం సదస్సు నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సిబ్బంది హాజరయ్యారు.
అంతా పకడ్బందీగా.. : ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారా జరిగిపోతుంది. కార్యాలయానికి ఏ పని మీద వెళుతున్నారో ఆర్టీఏ వెబ్‌సైట్ (telangana. transport.gov.in)లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి దరఖాస్తు ఫార్మాట్ కూడా వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఈ ప్రకారం దరఖాస్తుదారుడికి వీలైన రోజు, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కనుక ఖాళీ లేకుంటే మరో రోజును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న రోజు, సమయంలో దరఖాస్తుదారుడు సంబంధిత రవాణా కార్యాలయానికి వెళ్లి పని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు వెళ్లలేని పరిస్థితి ఉంటే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలి. అదే రోజు ఎంచుకున్న సమయానికి వెళ్లలేకపోతే చివర్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
అవినీతికి అడ్డుకట్ట పడేనా...!
ఆర్టీఏ కార్యాలయాల్లో డబ్బులు ముట్టజెప్పనిదే పనులు జరగవనేది బహిరంగ రహస్యమే. చేతులు తడిపితే పనులు ఆగమేఘాల మీద జరుగుతాయి. బ్రేకులు లేని వాహనాలకు కూడా డబ్బులిస్తే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు నిమిషాల్లో సిద్ధమవుతాయి. ఇపుడు ఈ స్లాట్ బుకింగ్ విధానంతో లంచాలను కట్టడి చేయడం సాధ్యమా అనేది అనుమానమే. అత్యవసర పనుల మీద స్లాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ రకమైన సిబ్బందిని ఎలా నియంత్రిస్తారో వేచి చూడాల్సిందే.