
నిరుద్యోగుల్లో వయోపరిమితి గుబులు
నిరుద్యోగుల్లో మళ్లీ వయోపరి మితి గుబులు మొదలైంది. ముఖ్యంగా డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఆందోళన ఎక్కువైంది.
తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్‌పీఎస్సీ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వం కూడా పదేళ్ల పాటు వయో పరిమితిని పెంచుతూ 2015 జూలై 27న ఉత్తర్వులు (జీవో 329) జారీ చేసింది. ఆ తర్వాత ఏడాది గడిచి న నేపథ్యంలో 2016 జూలై 26న మరోసారి గరిష్ట వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు అత్యధికంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ రాలేదు. ప్రస్తుతం టెట్‌కు హాజరు కానున్న 3.5 లక్షల మందిలో సాధారణ గరిష్ట వయోపరిమితి దాటిన అభ్యర్థులు వేలల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గరిష్ట వయోపరిమితిని మరోసారి పెంచాలని, లేకపోతే తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. 2012 నుంచి ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పెంచాలని కోరుతున్నారు.