అప్పుల రాష్ట్రం చేస్తారా?
♦ బడ్జెటేతర నిధులు తిరిగెలా చెల్లిస్తారు: అక్బరుద్దీన్
♦ అప్పుల శాతం తక్కువగానే ఉందన్న ఈటల
సాక్షి, హైదరాబాద్: ‘రాష్టాన్ని అప్పుల పాలు చేస్తారా? తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.60 వేల కోట్లున్న అప్పు.. ఈ బడ్జెట్‌లో రూ.1.23 లక్షల కోట్లకు చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మిషన్ భగీ రథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బడ్జెటేతర వనరులను సమకూర్చటం సందేహాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం పూచీకత్తుగా ఉండే ప్రతి రుణాన్నీ బడ్జెట్‌లో పొందుపరచాల్సి ఉంటుందని.. లేకుంటే తిరిగి చెల్లింపులెలా చేస్తారని ప్రశ్నించారు. ఏ కాలేజీకి వెళ్లి చూసినా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు జరగలేదని, దాదాపు రూ.254 కోట్ల బకాయిలున్నాయని అన్నారు.
శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు మంత్రి ఈటల సమాధానం అనంతరం అక్బరుద్దీన్ ఈ అంశాలను లేవనెత్తారు. స్పందించిన ఈటల.. అప్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.1 శాతం అప్పులే ఉన్నాయని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నామన్నారు. ఏపీలో 20.8 శాతం, బిహార్‌లో 23.8 శాతం, గోవాలో 30.5 శాతం, కేరళలో 17.3 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 14.3 శాతం అప్పులున్నాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సంబంధిత విభాగాలకు విడుదల చేశామని, అక్కణ్నుంచి చెల్లింపులు జరగకపోతే వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఉచిత సీట్ల బాధ్యత ప్రభుత్వానిదే: జీవన్‌రెడ్డి
కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు ఇప్పట్లో కాదని చెబుతున్న ప్రభుత్వం అప్పటివరకు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచిత సీట్లను కేటాయించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలన్నారు. పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా కాకుండా రైతులు, సర్వే నంబర్ల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రు. అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచిన ప్రభుత్వం ఆశ వర్కర్ల జీతాలెందుకు పెంచడం లేదన్నారు. ఉద్యమం సమయంలో గుర్తున్న పార్ట్ టైం స్వీపర్ల క్రమబద్ధీకరణ ఇప్పుడెందుకు గుర్తుకు రావటం లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు లాభాల బాట పట్టిన ఆర్టీసీని నిర్వీర్యం చేసిందెవరని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నించాలన్నారు.
అడ్వైజరీ కౌన్సిల్ ఏమైంది? రేవంత్ రెడ్డి
నిజాం చక్కెర ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోరారు. మానవతా దృ క్పథంతో ఆలోచించి డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏమైందన్నారు. ఉర్దూ స్కూళ్లు, కాలేజీల్లో టీచర్లు, లెక్చరర్లను నియమించాలన్నారు. ప్రతి మండలానికో కాలేజీని, నియోజకవర్గానికి ఐటీఐని, ప్రతి జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచేయి:కె.లక్ష్మణ్
బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశలను ప్రభుత్వం నీరుగార్చిందని బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అయిదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేటాయింపుల్లో మోసం చేసిందన్నారు. ఉద్యోగాలను కల్పించలేకపోతున్న ప్రభుత్వం ఇంజనీరింగ్, బీఈడీ కాలేజీలను మూసివేసే సంకేతాలిస్తుందా అని ప్రశ్నించారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని, పరీక్షను మరో మూడు నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1,4, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల ఖాళీలన్నీ భర్తీ చేస్తే ఉద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఎస్‌ఐ పరీక్షలకు ఇంగ్లిష్ పాటవాన్ని పరీక్షించటం అనుచితంగా ఉందని, గ్రామీణ విద్యార్థులు నష్టపోతారన్నారు. జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులు చెల్లుబాటు కావటం లేదన్నారు.
మైనారిటీ శాఖను అగ్రస్థానంలో నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్: మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించినా మైనారిటీ సంక్షేమ శాఖ ఖర్చు చేయలేకపోయిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందిని నియమించకుండా గత పాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్ల మైనారిటీ శాఖ నిర్వీర్యమైందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త పోస్టులు మంజూరు చేశామని, ఆ శాఖను అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2014-15లో మైనారిటీల సంక్షేమానికి 32 శాతం నిధులు మాత్రమే వెచ్చించడంపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు శనివారం శాసనసభలో ఆయన వివరణ ఇచ్చారు.