అన్నీ పాత ఫీజులే
- ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంటెక్, ఎంఫార్మసీ, లా ఫీజులు ఖరారు
- 2013-2015 నాటి ఫీజులే 2016 నుంచి 2018-19 వరకు అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్ మినహా మిగతా సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు గతంలో అమలు చేసిన ఫీజులనే కొనసాగిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఈడీ, లా, ఫార్మ్-డీ, ఎం-ఆర్క్, ఎం-ప్లానింగ్ కోర్సులన్నింటికి పాత ఫీజుల ఆధారంగానే ప్రవేశాలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14, 2014-15, 2015-16 విద్యా సం వత్సరాల్లో ఆయా కోర్సులకు వివిధ కాలేజీల్లో ఎంత ఫీజు ఉందో, వచ్చే మూడేళ్లపాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) దానినే అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రవేశాల కమిటీ లు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపునకు రంగం సిద్ధం చేశాయి.
ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఫీజు విషయంలో ఉపశమనం లభిం చింది. ప్రభుత్వంపైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం భారీగా తగ్గనుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) నాలుగైదు నెలలపాటు కాలేజీల యాజమాన్యాలతో పలు దఫాలు చర్చించి, కాలేజీల ఆదాయ వ్యయాలనుబట్టి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వామోదం కోసం పంపింది. ఈ ప్రతిపాదనలను 3 నెలలుగా పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం పాత ఫీజుల విధానాన్నే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించింది. ఇన్నాళ్లూ ఫీజుల జీవోలు రాకపోవడం వల్ల ఆయా కోర్సుల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి.
కొత్త కాలేజీలకు కనీస ఫీజు...
ఈసారి కొత్తగా ప్రవేశాలకు అనుమతి, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలకు కనీస ఫీజునే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టే అటువంటి కాలేజీల న్నింటినీ ఆయా కోర్సులకు సంబంధించిన కనీస ఫీజునే తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాత, కొత్త కాలేజీల్లో కనీస, గరిష్ట ఫీజులకు అదనంగా స్పెషల్ ఫీజులు ఉ న్నాయి (ఉదాహరణకు బీఈడీలో రూ. 3 వేల స్పెషల్ ఫీజు). కోర్సునుబట్టి స్పెషల్ ఫీజుకు గతంలో నిర్ణయించిన దానినే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లలో పొందొచ్చు.
2016-17 నుంచి 2018-19 వరకు ఫీజులివీ...
నోట్: ఎంటెక్‌కు సంబంధించి యూనివర్సిటీ కాలేజీల్లో ఫీజు రూ. 30 వేలుగా ఉంది. ఎంఫార్మసీ కోర్సుకు ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా ఫీజును నిర్ణయించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఫార్మసీ ఫీజు రూ. 30 వేలుగా ఉంది.