- రాష్ట్రంలో 1,500 కిలోమీటర్లకుపైగా దెబ్బతిన్న రహదారులు
- దెబ్బతిన్న వంద కల్వర్టులు, వంతెనలు
- 200 ప్రాంతాల్లో భారీగా కోత.. 43 చోట్ల గండ్లు
- నష్టం ప్రాథమిక అంచనా రూ.500 కోట్లకుపైనే!
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో రోడ్లు కోతకు గురికాగా.. పలు చోట్ల కల్వర్టులు, వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల పొడవునా ఆనవాళ్లు కూడా లేనంతగా పాడైపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ ఆధీనంలోని 1,000 కిలోమీటర్లకుపైగా రహదారులు, పంచాయతీ రాజ్ శాఖ అధీనంలోని 582 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని... మొత్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నా.. భారీ వరద వస్తే బలహీనంగా ఉన్న చోట రోడ్లు నిలిచే పరిస్థితి లేదు.
భారీగా దెబ్బతిన్న కల్వర్టులు
రాష్ట్రవ్యాప్తంగా 100 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. 200 చోట్ల వంతెనలు, కల్వర్టు గోడలు దెబ్బతిన్నాయి. 71 ప్రాంతాల్లో రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులు బాగా దెబ్బతిని గుంతలు పడ్డాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నష్టం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 248 కి లోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 43 చోట్ల రోడ్లకు గండ్లుపడ్డాయి. కొత్త వంతెనలు, కల్వర్టుల నిర్మాణం కోసం వాహనాలను దారి మళ్లింపునకు నిర్మించిన తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా ఖన్సాన్‌పల్లి-ఖదీరాబాద్ రోడ్డు, కావెలి-కోహిర్-తుర్మామిడి రోడ్డుపై ఉన్న వంతెనలు కిలోమీటరు మేర ధ్వంసమయ్యాయి. కొడకల్-జగదేవ్‌పూర్ మార్గంలో రోడ్డు కొట్టుకుపోయింది.
తాత్కాలిక మరమ్మతులకు రూ.50 కోట్లు
రోడ్లు దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో.. యుద్ధప్రాతిపాదికన తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేసి, రాకపోకలను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దీంతో రోడ్లు భవనాల శాఖ దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టింది. కాగా రహదారులకు జరిగిన నష్టంపై రోడ్లు భవనాల శాఖ మధ్యంతర నివేదికను సిద్ధం చేస్తోంది.
బాగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులు
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ అధికారులు సేకరించిన ప్రాథమిక వివరాల మేరకు తొమ్మిది జిల్లాల్లో 582 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.63కోట్లు అవసరమని, శాశ్వత మరమ్మతుల కోసం మరో రూ.126.03 కోట్లు కావాలంటూ అధికారులు నివేదిక సమర్పించారు. మొత్తంగా రూ.147.66కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు.
అత్యవసర కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాయి. ప్రజల నుంచి వచ్చే ఫోన్లకు 24 గంటల పాటు అందుబాటులో ఉండటంతో పాటు.. అందుకు అనుగుణంగా స్పందించే యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్‌ల వద్ద అధికారులు సిద్ధంగా ఉంచారు. సచివాలయంలో 040-23454088, జీహెచ్‌ఎంసీలో 21111111, విద్యుత్ శాఖలో 1912100, 7382072104, 7382072106, 9490619846, నీటిపారుదల శాఖలో 040-23390794 నంబర్లకు ఫోన్లు చేయాలని తెలిపారు.
రోడ్లన్నీ ఛిన్నాభిన్నం
Published Sun, Sep 25 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement
Advertisement