ఖయ్యూమ్ ఏదైనా ఇట్టే పసిగట్టేస్తాడు..
ఎప్పుడో.. అనుకోకుండా కలిసిన ఓ స్పర్శ.. అనంతరం ఆత్మీయ మనసై మనవెంట వస్తుంది. బాధలో ఓదారుస్తుంది. పడిపోతుంటే చేయందిస్తుంది. మనసెరిగి మసలుకుంటుంది. అదే స్నేహం. జీవిత ఎత్తుపల్లాలను తనవిగా భావించి మనసున మనసై చిరకాలం నిలిచిన స్నేహితుడు అల్లరి నరేష్ తమ స్నేహాన్ని ఇలా ఆవిష్కరించారు.
చిన్నప్పుడు వేసవి సెలవుల్లో చెన్నైలో నాన్న దగ్గరకు వెళ్లా. అప్పుడు ఆయన ‘ఏవండీ ఆవిడొచ్చింది’ సినిమా తీస్తున్నారు. షూటింగ్‌లో పరిచయమయ్యాడు హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూమ్. ఆ సినిమాల్లో మేము కలిసి నటించాం కూడా. అలా ఆర్టిస్టులుగా ఏర్పడ్డ మా పరిచయం ఆత్మీయ స్నేహమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఉన్న ఆప్త మిత్రుడు ఖయ్యూమ్. మేము హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజుల్లోనే అలీ కుటుంబం కూడా ఇక్కడకు వచ్చేసింది. అప్పటి నుంచి రెగ్యులర్‌గా కలుసుకుంటూనే ఉన్నాం. ఖయ్యూమ్ నిష్కల్మశమైన వ్యక్తి.
చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాడు. నా ప్రతి ఫీలింగ్‌ను ఇట్టే పసిగట్టేస్తాడు. నా మనసులోని భావనలు బయటకు కనిపించకుండా ప్రయత్నిస్తాను. కానీ కయ్యూమ్‌కు మాత్రం తెలిసిపోతాయి. ప్రతి రోజూ కాకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారి కలుస్తాం. మా మధ్య సినిమాల కంటే లెటెస్ట్ ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటివే ఎక్కువ చర్చనీయాంశాలవుతాయి. ఇద్దరం కలిసి కాఫీషాప్‌లకు వెళ్తాం. కలిసి సినిమాలు చూస్తాం. చాలా హ్యాపీగా గడిపేస్తాం. - అల్లరి నరేష్, సినీనటుడు