‘‘హీరో క్యారెక్టరైజేషన్ పాజిటివా? నెగటివా? అనే విషయాలను పక్కనపెట్టి, హీరో తాలూకు కొత్త రకం ఎమోషన్స్‌ను ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరహా ఎమోషన్స్ బచ్చల మల్లి క్యారెక్టర్‌లో ఉంటాయి. చెప్పాలంటే... ప్రతి మనిషిలోనూ కొంత గ్రే షేడ్ ఉంటుంది. ఈ ప్రకారం ప్రతి మనిషిలోనూ బచ్చల మల్లి ఉంటాడు. ‘అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, పుష్ప’ తరహా సినిమాలను చూసి, ఆడియన్స్ ఏం మారలేదు.
‘పుష్ప’ సినిమా చూసి, ఎవరూ చందనం కొట్టడానికి అడివికి వెళ్లలేదు. అలాగే ‘బచ్చల మల్లి’ క్యారెక్టర్‌ను కూడా ఎవరూ బ్యాడ్‌గా తీసుకోరని అనుకుంటున్నా. ఒకవేళ మంచి తీసుకోవాలనుకుంటే మద్యం సేవించకూడదని ఈ సినిమాలో చెప్పాం. ఈ సందేశాన్ని తీసుకోవచ్చు’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయిక. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు.
⇒ ‘బచ్చల మల్లి’ కథ 1990, 2005.. ఇలా రెండు కాలమానాల్లో జరుగుతుంది. ఓ ఊర్లో ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తి బచ్చల మల్లి (అల్లరి నరేశ్ పాత్ర పేరు). తనను ఎవరైనా వద్దనుకుంటే ఇక తన జీవితంలో వాళ్లు ఉండాలని కోరుకోడు. మూర్ఖత్వంతో ప్రవర్తిస్తుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్ పాత్ర పేరు) వచ్చిన తర్వాత అతని జీవితమే మారిపోతుంది.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటుంటాడు. కానీ గతంలో బచ్చల మల్లి చేసిన తప్పులు అతన్ని వెంటాడుతుంటాయి? అప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్‌లో హ్యుమర్ చాలా తక్కువ. మిగిలిన అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బచ్చల మల్లి ఏడిపిస్తాడు... నవ్విస్తాడు. ‘గమ్యం’లో నేను చేసిన గాలి శీను పాత్రలా బచ్చల మల్లి పాత్ర కూడా పదేళ్ల పాటు ఆడియన్స్‌కి గుర్తుండిపోతుంది.
⇒ బచ్చల మల్లి ఎవరిదో ఆటోబయోగ్రఫీ అని అంటున్నారు. కానీ కాదు. దర్శకుడు సుబ్బు ఊర్లో బచ్చల మల్లి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని కథను రెడీ చేశారు. నిజమైన బచ్చల మల్లిని నేను సెట్స్‌లో కూడా కలిశాను. ఈ
క్యారెక్టరైజేషన్ తాలూకు బాడీ లాంగ్వేజ్ చాలెంజింగ్‌గా అనిపించింది. నా నడకలో మూర్ఖత్వం ఉండాలని అడిగేవాడు సుబ్బు. అలాగే కొత్తగా ఏడ్వమన్నాడు. అంటే నా పాత సినిమాల ప్రభావం ఈ సినిమాపై రాకుండా సుబ్బు జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే బచ్చల మల్లి వరల్డ్‌లోకి ఆడియన్స్ వెళ్తారు. తెరపై ‘అల్లరి’ నరేశ్ కనిపించడు. బచ్చల మల్లి మాత్రమే కనిపిస్తాడు.
⇒ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ దగ్గర్నుంచి నిర్మాత రాజేశ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఆయన ‘బచ్చలమల్లి’ కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యారు. ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్‌గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, నటుడిగా అంత మంచి పేరు నాకు ఈ సినిమాతో వస్తుందని నిర్మాత అన్నారంటే ఆయన సినిమాకు అంత కనెక్ట్ అయ్యారు. ‘రంగస్థలం’ సినిమాకు ఓ నటుడిగా రామ్‌చరణ్‌గారికి వచ్చిన పేరులో నాకు సగం గుర్తింపు వచ్చినా చాలు.
⇒ కామెడీ నా హోమ్‌గ్రౌండ్. సీరియస్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలు చేస్తుంటాను. అయితే ఆర్గానిక్ కామెడీ రాసే రైటర్స్ తక్కువైపోయారు. కొంతమంది రైటర్స్ దర్శకులుగా బిజీ అవుతున్నారు. ‘సుడిగాడు 2’ సినిమా కోసం కథ రాస్తున్నాను. ఇందులో పాన్ ఇండియా సినిమాలపై స్పూఫ్స్ చేస్తాను. నార్త్ ఇండియా సినిమాల ప్రస్తావన కూడా ఉంటుంది. ‘జెండా’ అనే కథ ఉంది. నా ప్రస్తుత కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ కథతో సినిమా ్రపారంభిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment