మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ‘మా బిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా రూ. 25 లక్షలు ఖర్చవుతుందంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. కూతురు పడుతున్న బాధలు చూడలేకపోతున్నాము. రాత్రింబవళ్లు ఇద్దరం కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితి. వైద్యం చేయించలేక పోతున్నాము. మా కూతురు కారుణ్య మరణానికి అనుమతించండి’ అని జగద్గిరిగుట్టకు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతులు గురువారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హర్షిత(11) కొంతకాలంగా కామెర్లతో బాధపడుతుండగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
డాక్టర్లు పరీక్షించి అమ్మాయికి కాలేయం పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని ఇందుకోసం రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ దంపతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఉప్పునూతలకు చెందిన రాంచంద్రారెడ్డికి కూతురు హర్షితతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. పదేళ్ల క్రితం నగరానికి వచ్చిన వీరి కుటుంబం జగద్గిరిగుట్టలో ఉంటుంది.
స్థానికంగా ఓ స్వీట్‌షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగద్గిరిగుట్టలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హర్షితను అనారోగ్య కారణాల వల్ల చదువు మాన్పించారు. కష్టపడి సంపాదించిన రూ. 2.5 లక్షలు సైతం కూతురు కోసమే ఖర్చు చేశానని, ఇక తన వద్ద డబ్బులు లేవని.. గత్యంతరం లేకనే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నట్లు రాంచంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.