డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు
⇒ త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదిక: కడియం
⇒ 9 రోజుల పాటు చైనాలో భారీ విగ్రహాల తయారీపై అధ్యయనం చేసిన కమిటీ
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం కోసం చైనా వెళ్లిన అంబేడ్కర్ విగ్రహ కమిటీ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ సభ్యులు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ లు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్, ఇతర అధికారులు 9 రోజులపాటు చైనాలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహా లను సందర్శించారు.
వాటిని తయారు చేసిన కంపెనీలు, నిర్వహణ చేస్తున్న కమిటీ లతో చర్చించారు. ఈ కమిటీ చైనాలోని షాంఘై, నాన్జింగ్, వుక్సి, లింగ్ షాన్, హాం కాంగ్ వంటి నగరాల్లో పర్యటించింది. ఇందులో వుక్సిలో 88 మీటర్ల (289 అడు గుల) ఎత్తైన విగ్రహాన్ని, హాంకాంగ్ లో 70 మీటర్ల (220 అడుగుల) ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఈ కమిటీ సందర్శించింది. షాంఘై ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ కంపెనీ, ఏరోసన్ ఇంజనీరింగ్ కంపెనీలు భారీ విగ్రహాలు రూపొందించడంలో ప్రఖ్యాతి గాంచినవని కమిటీ తెలిపింది. హైదరాబాద్ లో అంబేడ్కర్ భారీ విగ్రహ ఏర్పాటు, స్మృతి వనం రూపకల్పనపై ఆయా కంపెనీల ఆసక్తి, భాగస్వామ్యంపై చర్చించారు. త్వరలోనే తాము సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేస్తామని కడియం పేర్కొన్నారు.