వీసా కోసం అడ్డదారి తొక్కి....
‘అమెరికా కాన్సులేట్’లో నకిలీ ప్రతాలు సమర్పణ
దరఖాస్తుదారుడితో పాటు మరో వ్యక్తి అరెస్టు
సనత్‌నగర్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావించిన ఓ యువకుడు నకిలీ పత్రాలతో వీసా పొందేందుకు యత్నించి అమెరికా కాన్సులేట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బేగంపేట పోలీసులు శుక్రవారం ఇతడితో పాటు నకిలీ పత్రాలు సమకూర్చిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. అల్వాల్‌కు చెందిన బి.సాయివర్దన్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలని భావించాడు. వీసా పొందేందుకు అవసరమైన పత్రాల కోసం కర్నూల్‌కు చెందిన డెంటిస్ట్ వెంకటేష్‌ను సంప్రదించగా... అతను రాజస్థాన్‌లోని సీజర్ యూనివర్సిటీలో చదివినట్లుగా నకిలీ విద్యార్హత పత్రాలు సృష్టించి ఇచ్చాడు.
వీటితో సాయివర్దన్‌రెడ్డి బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో గత మార్చిలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన అధికారులు అవి నకిలీవిగా గుర్తించారు. ఇదిలా ఉండగా... సాయివర్దన్‌రెడ్డి శుక్రవారం సర్టిఫికెట్ల కోసం యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి రాగా... అక్కడి అధికారుల సమాచారం మేరకు ఎస్‌ఐ నాగరాజు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే, ఇతనికి నకిలీ పత్రాలు సమకూర్చిన వెంకటేష్‌ను సైతం పట్టుకున్నారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.