సనత్‌నగర్, న్యూస్‌లైన్: నగర కాలుష్యంలో ‘అమ్మోనియా’ చేరడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డై ఆక్సైడ్స్, పీఎం 10 అత్యధిక మోతాదులో నమోదవుతూ వస్తుండగా... ఇప్పుడు అమ్మోనియా మోతాదు మించడం ఆందోళన కలిగిస్తోంది. మనిషి జీవక్రియకు కొంత మోతాదులో అమ్మోనియా అవసరమే. కానీ మోతాదు మించితే మానవ ఆరోగ్యం, మొక్కల ఎదుగుదలపై తీవ్ర దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో అమ్మోనియా మోతాదు వార్షిక సరాసరి క్యూబిక్ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు (100 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు)గా ఉండాలి. కానీ నగరంలో అంతకుమించిన స్థాయిలో అమ్మోనియా వెలువడుతుందని, ఇది ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంద ని పీసీబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గత ఏడాది వార్షిక సరాసరిని పరిశీలిస్తే జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 123 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు గా నమోదు కావడం విశేషం. ఆ తరువాత స్థానాల్లో చార్మినార్ 120, ఉప్పల్ 118గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జూపార్కు, జీడిమెట్ల ప్రాంతాల్లో సైతం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ స్థాయిలో అమ్మోనియా విడుదలైనట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
పెరుగుదలకు కారణాలివే...
అమ్మోనియా ఉద్గారాలు పారిశ్రామికవాడల నుంచి అధికంగా విడుదలవుతున్నట్లు పీసీబీ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, ప్లాస్టిక్, పేలుడు పదార్థాలు, వస్త్రాలు, కెమికల్, రంగులు తయారీ పరిశ్రమల్లో విచ్చలవిడిగా అమ్మోనియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆయా ఉత్పత్తులు ఉత్పత్తి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో అమ్మోనియా వాయువులు గాలిలోకి విడుదలవుతుంటాయి. ఒక్కోసారి అధిక వేడికి అమ్మోనియా కంటైనర్లు పేలిపోతుంటాయి.
ఈ క్రమంలో ఆయా ప్రాంతంలో నివసించేవారి ఆరోగ్యంపై పెనుప్రభావం పడుతోంది. పాతకాలం నాటి రిఫ్రిజిరేటర్లు, ఐస్ తయారీ కేంద్రాలు, డ్రైక్లీనర్స్ ద్వారా అమ్మోనియా వెలువడుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయా చోట్ల కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అమ్మోనియా ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.
పరిశ్రమలే కారణం
పరిశ్రమల ద్వారా అమ్మోనియా ఎక్కువగా విడుదలయ్యే అ వకాశం ఉంది. ఇది జనావాసాల్లో సైతం ఎక్కువగా ఉంటుం దంటే డ్రైక్లీనింగ్‌ల వాడకం అధికంగా ఉండడమో లేక సమీప పరిశ్రమల నుంచి విడుదలైన అమ్మోనియా ఆయా ప్రాంతాలకు వ్యాపించడమో జరగాలి. దీన్ని ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం భారంగా ఉంటుంది. ఆక్సిజన్ సైతం సరైన మోతాదులో అందదు.
- వీరన్న, పీసీబీ సైంటిస్ట్
ఊపిరితిత్తులు దెబ్బతింటాయి
అమ్మోనియా ఎక్కువగా పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అమ్మోనియా శాతం ఎక్కువగా ఉంటే కళ్లు, గొంతు, చర్మం మంటలు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
- డాక్టర్ పద్మజ, అమీర్‌పేట్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారిణి
మోతాదు మించితే దుష్ర్పభావాలెన్నో...
నిర్దేశిత ప్రమాణాలకు మించి అదనంగా ఒక గ్రాము/క్యూబిక్ మీటరు విడుదలైనా ఇబ్బందే అధిక మోతాదులో అమ్మోనియాను పీలిస్తే శ్వాస భారమవుతుంది. చర్మం, కళ్లు మంటలు పుడతాయి. ముక్కు, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేహంలోని మాంసకృత్తులను విచ్ఛిన్నం చేస్తాయి. అమ్మోనియా హైడ్రాక్సైడ్ మానవ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.అమ్మోనియాను ఎక్కువగా పీలిస్తే కడుపు మంట కూడా ఉంటుంది. మొక్కల ఎదుగుదలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది గాలి కంటే బరువైంది. ఏ ప్రాంతంలోనైనా దీని ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. బరువుగా ఉంటున్నందున ఊపిరితిత్తులపై భారం అధికంగా ఉంటుంది. ఈ వాసన పీల్చిన వారిలో చిరాకు ఎక్కువగా ఉంటుంది.