అడ్రస్ లేని శవం!
రాష్ట్రంలో ప్రతిరోజూ 10–12 గుర్తు తెలియని మృతదేహాలు
♦ 11 ఏళ్లు.. 32 వేల మృతదేహాలు
♦ ఎవరో తెలియదు.. వారి సంబంధీకుల జాడ తెలియదు
♦ చనిపోతున్నవారిలో యుక్త వయసు వారే ఎక్కువ
♦ నెలరోజులు భద్రపరచి మున్సిపాలిటీకి అప్పగిస్తున్న పోలీసులు
♦ అనాథ శవంగా పరిగణించి అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్:
ఓ పదహారేళ్ల అమ్మాయి. అర్ధరాత్రి సమయంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. కారణమేంటో తెలియదు. మౌలాలి రైల్వేట్రాక్‌పై శవం ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. తల, మొండెం వేర్వేరుగా పడి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా పూర్తి చేశారు.
ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ అనుమానాలన్నీ ఓవైపు.. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరికి అప్పగించాలి? సంబంధీకులను ఎలా గుర్తించాలన్న సమస్య మరోవైపు! పోలీసులు పత్రికా వాళ్లను, టీవీ చానళ్ల వారందరినీ పిలిచారు. మృతదేహం ఆనవాళ్లు చెప్పారు. అమ్మాయి శవాన్ని సంబంధీకులకు అప్పగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అమ్మాయి తమ సంబంధీకురాలే అంటూ ఎవరూ రాలేదు.
ఏం చేయాలో తెలియక పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.. నెలరోజుల పాటు మార్చురీలోనే ఉన్న మృతదేహం.. మున్సిపాలిటీ విభాగానికి చేరింది. తర్వాత అనాథ శవంగా పరిగణించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇలా ఆ ఒక్క అమ్మాయి మృతదేహమే కాదు రాష్ట్రంలో ప్రతిరోజూ 10 నుంచి 12 గుర్తు తెలియని శవాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత 11 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 32 వేల గుర్తు తెలియని మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. అసలు ఇలా ఎంత మంది చనిపోతున్నారు? మృతదేహాల గుర్తింపునకు ఎన్ని రోజుల సమయం ఉంటుంది? ఇప్పటిదాకా ఏ వయసువారీ శవాలు ఎక్కువగా లభ్యమయ్యాయన్న అంశాలపైదే.. ఈ కథనం.
ఏటా 3 వేల మృతదేహాలు
ఆత్మహత్యలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ప్రమాదవశాత్తు మృతి చెందడం.. ఇలా అనేక ఘటనల్లో 2006 నుంచి 2017 మార్చి వరకు 32 వేల గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమైనట్టు పోలీస్ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఇలా ప్రతి ఏటా రాష్ట్రంలో 3 వేలకు పైగా గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమవుతుండగా.. రోజుకు 10 నుంచి 12 గుర్తు తెలియని శవాలను స్వాధీనం చేసుకుంటున్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మృతదేహాల గుర్తింపులో పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉంటోందని, దర్యాప్తు అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం, సిబ్బంది కొరత, పని ఒత్తిడి వల్ల శవాల గుర్తింపు కష్ట సాధ్యమవుతోందని సీనియర్ ఐపీఎస్‌లు కొందరు అభిప్రాయపడ్డారు.
సగం యువతవే..
2006 నుంచి ఇప్పటివరకు లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాల్లో సగం వరకు యుక్తవయసు వారివేనని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం, ఆర్థిక ఇబ్బందులు, చదువు, మానసిక ఒత్తిడి, కుటుంబ కారణాలు.. ఇలా అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతంలో పేర్కొంది.
భద్రపరిచేది నెల రోజులే..
పంచనామా తర్వాత పోలీసులు శవాన్ని దగ్గర్లోని మార్చురీలో భద్రపరుస్తారు. వాల్‌పోస్టర్లు, టీవీ ప్రకటనలు, బస్టాండ్లలో పోస్టర్లు.. ఇలా అనేక రకాలుగా మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తారు. చట్టం ప్రకారం నెలరోజుల పాటు గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో భద్రపరచవచ్చు.
ఆ తర్వాత కూడా సంబంధీకులు రాకుంటే మున్సిపల్ విభాగానికి అప్పగిస్తారు. మున్సిపల్ విభాగం ఆ మృతదేహాలను ఖననం చేస్తుంది. ఢిల్లీ, పంజాబ్‌లో అయితే కేవలం 72 గంటల పాటే గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో పెడతారని, తర్వాత ఎవరూ రాకుంటే ఖననం చేస్తారని పోలీస్ అధికారులు తెలిపారు.
గత 11 ఏళ్లలో గుర్తు తెలియని మృతదేహాల వివరాలు..
ఆదిలాబాద్ 2,201
కరీంనగర్ 3,930
నల్లగొండ 1,056
వరంగల్ కమిషనరేట్ 690
సైబరాబాద్ 1,772
ఖమ్మం 3,104
నిజామాబాద్ 1,972
రైల్వే పోలీస్ 6,741
మహబూబ్‌నగర్ 4,902
రంగారెడ్డి 663
హైదరాబాద్ 1,729
మెదక్ 2,283
వరంగల్ రూరల్ 822
మొత్తం 31,865
ఇప్పటివరకు దొరికిన శవాలు..
పురుషులు 24,012
మహిళలు 7,658
ట్రాన్స్‌జెండర్స్ 2
వయసుల వారీగా...
12 128
14 206
16 286
18 398
20 684
22 680
24 386
26 1,385
28 835
30 1,662.